పుట్టపర్తి అర్బన్ : భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమోఘమైన ప్రగతి సాధించిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సత్యసాయి యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవ వేడుకలను మంగళవారం నాడు సాయి కుల్వంత్‌హాల్‌లో ఘనంగా నిర్వహించారు. సత్యసాయి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్‌తో సభా వేదికకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులను ఉద్ధేశించి ఇస్రో ఛైర్మన్ ప్రసంగించారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడి గణనీయంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివద్ధి చెందిందన్నారు. అంతరిక్ష రంగంలో అభివద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ ప్రగతి సాధిస్తోందన్నారు. దేశీయంగా రాకెట్లు, సాటిలైట్లు తయారు చేస్తున్నామంటే దేశీయంగా ఇది అభివద్ధికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా ఇందులో భారతదేశ యువత ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. సత్యసాయిబాబా ప్రేమతత్వంతో మిళితమైన సేవా భావాన్ని తమ చేతుల్లో విద్యార్థులు చేసి చూపించాలన్నారు. సత్యసాయి విలువలు సామాజిక బాధ్యతతో కూడుకున్నవిగా ఉంటాయన్నారు. ప్రతి విద్యార్థీ సమాజ హితమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 22 మంది విద్యార్థులకు బంగారు పథకాలు, 17 మందికి పిహెచ్‌డి పట్టాలు, 486 మందికి ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్, ట్రస్టు సభ్యులు నాగానంద, డాక్టర్ మోహన్, యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










