ప్రజాశక్తి- వీరఘట్టం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. వీరఘట్టం వట్టిగెడ్డ నుంచి అంబేద్కర్ కూడలి వరకూ శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ధాల పాటు కార్మికవర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్న అనేక సంక్షేమ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కార్మికులకు నష్టదాయకంగా లేబర్ కోడ్లను తీసుకొస్తుందన్నారు. ఈ లేబర్ కోడ్లతో కార్మికవర్గానికి గతంలో ఉన్న అనేక హక్కులు, సంక్షేమ చర్యలు, సౌకర్యాలు రద్దు అవుతాయన్నారు. చివరికి కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌లపైనా ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. సమ్మె హక్కును, సమిష్టి బేరసారాల హక్కునూ అదుపు చేసేలా ఈ లేబర్ కోడ్‌లు రూపొందించారని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌తో సహా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు, బ్యాంకులు, జీవిత బీమా, రైల్వేలు తదితర ప్రజా ఉపయోగ సంస్థలను ప్రయివేటీకరించి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలను తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. జాతి సంపదను వ్యక్తుల పరం చేయడం ద్వారా దేశానికి, ప్రజలకు బిజెపి ద్రోహం చేస్తున్నదన్నారు. భూ నగదీకరణ పేరిట విలువైన ప్రజా ఆస్తులను, రహదారులను ప్రాజెక్టులను నామమాత్రమైన లీజుతో దీర్ఘకాలం పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఖండించాలన్నారు. ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును 45 ఏళ్ల కనిష్టానికి తగ్గించేసిందన్నారు. ధరల పెరుగుదల, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కార్మికుల కనీస వేతనం నెలకు రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరఘట్టంలో సమ్మె సన్నాహాక ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.రూపవతి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పి.ఎన్.ప్రసాదరావు, వై.ప్రసాదరావు, ఐద్వా నాయకులు కళావతి, వాణి, పార్వతి, సావిత్రి పాల్గొన్నారు.
పలాస : మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రజా సంఘ నాయకులు పిలుపునిచ్చారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ ఆశ్రమం నుంచి పలాస జూనియర్ కళాశాల వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఎం.రామారావు, కుత్తుం దుష్యంత్, సిహెచ్.మురుగన్ పాల్గొన్నారు.
రణస్థలం : కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు 'ప్రజలను కాపాడండి... దేశాన్ని రక్షించండి' అని పిలుపునిస్తూ... చేపడుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు రణస్థలంలో సమ్మె ప్రచారం కార్యరకమం నిర్వహించారు. అనంతరం పోస్టర్లను పంపిణీ చేశారు. అలాగే అరబిందో ఫార్మా, యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమలు వద్ద నిర్వహించిన సమ్మె సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయుకులు ఎన్.తారకేశ్వరావు, జె.గంగరాజు, ఐ.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. ఆటో కార్మిక సంఘాల నాయకులు వైఎస్‌ఆర్ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు శనివారం ఆటోలతో ర్యాలీ నిర్వహించి విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కో- కన్వీనర్ ఎ.లక్ష్మణరావు, కెవిపిఎస్ మండల కార్యదర్శి దూసి దుర్గారావు, రైతు సంఘం ప్రతినిధి నాయుడు, ఆటో కార్మిక సంఘాలు ప్రతినిధులు కాయల శ్రీనివాసరావు, వి.అప్పారావు, తేజ, గురువులు, వీరయ్య, హరి, సతీష్, రాంబాబు పాల్గొన్నారు.










