ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని డైమండ్ పార్కు నుంచి ఏడు రోడ్ల కూడలి వరకూ సమ్మె ప్రచారంలో భాగంగా అన్ని ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలతో ప్రదర్శన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించి ప్రదర్శనను అడ్డుకున్నారు. పోలీసులను ప్రతిఘటించి ముందుకెళ్లడానికి కార్మిక సంఘాల నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు వాగ్వివాదం జరిగింది. ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ డైమండ్ పార్కు దగ్గర సభ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న ఉద్యోగ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించేందుకు కష్టజీవులంతా ఏకం కావాలన్నారు. రాష్ట్రంలోనూ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మోడీ విధానాలను ప్రతిఘటించకపోతే దేశానికి భవిష్యత్ ఉండదని అన్నారు. ఎల్‌ఐసి, బ్యాంకులు, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో సహా ప్రభుత్వరంగ సంస్థలన్నీ కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతం గా సభలకు, సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులను గృహ నిర్బంధించడం ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. అధికార పార్టీ తప్ప ఇంకా ఎవరూ సభలు, సమావేశాలకు పెట్టకూడదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి.తిరుపతిరావు, వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు వి.జి.కె.మూర్తి, ఎన్.బలరాం, ఎ.గణేష్, ఎ.శేఖర్, ఎ.దేవసంతోష్, డి.లక్ష్మి, జె.మాధవి, ఎ.రాజ్యలక్ష్మి, కె.ఆదిలక్ష్మి, ఎం.ఆదినారాయణమూర్తి, పార్వతీశం, ఎల్.అశోక్, డి.వాసు, కె.అప్పారావు, కె.గణపతి, రాంబాబు పి.జ్యోతీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
సంతకవిటి : భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లయిమ్‌లను తక్షణమే చెల్లించాలని, కార్మిక సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి సంక్షేమ పథకాలను యథావిధిగా డిమాండ్ చేస్తూ... ఈ నెల 28,29 తేదీల్లో చేపడుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.రామ్మూర్తినాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంతకవిటి మండలం మండవకురిటిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... చేపడుతున్న సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.రామ్మూర్తినాయుడు పిలుపునిచ్చారు. సంతకవిటి మండలం మండవకురిటి పిహెచ్‌సి వద్ద సమావేశం నిర్వహించి అనంతరం అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు.
భామిని: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు సిర్ల ప్రసాద్ పిలుపునిచ్చారు. భామినిలోని ప్రజా సంఘాల నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాలు నాయకులు జి.జగన్నాయకులు, కె.ధర్మారావు, కె.ప్రసాద్, కె.భాస్కరరావు, నాగేశ్వరరావు, ప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించే సార్వత్రిక సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని సిఐటియు నాయకుడు హనుమంతు ఈశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక సిఐటియు నాయకులతో కలిసి సమ్మెను జయప్రదం చేయాలని కోటబొమ్మాళిలో ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డిజల్ ధరలతోపాటు ఏకంగా ఒకే సారి రూ.50లు గ్యాస్‌పై పెంచి ప్రజల నెత్తిన భారం మోపిందన్నారు.










