ప్రజాశక్తి విలేకరులు...... కనగానపల్లి : ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మ కానికి వ్యతిరేకంగా ఈనెల28,29 తేదీల్లో నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు కోరారు. ఆదివారం కనగానపల్లి హై స్కూల్‌లో సిఐటియు మండల కార్యదర్శి బత్తల కదిరప్ప అధ్యక్షతన కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జి.ఓబులు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానా లను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీలలో జాతీయ కార్మిక సంఘాలు నేతృత్వంలో రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమ్మెలో కార్మికవర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం కార్మికులతో కలిసి సమ్మెకు సంబంధించిన బుక్లెట్,కరపత్రాలు లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, శ్రీరాంరెడ్డి వాటర్ సప్లై వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర నాయకులు నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని మార్కెట్‌లో సిఐటియు ప్రాంతీయ కమిటీ సమావేశం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ ప్రజల దేశ రక్షణకై మార్చి 28, 29వ తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని , పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ,ప్రైవేటీకరణను జాతీయ నగదీకరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను పరిధిలోని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయలు ఆర్థిక మద్దతు ఇవ్వాలని ,పెట్రోల్ డీజిల్ లేదా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కోరారు. అంగనవాడి, ఆశా, మధ్యాహ్నభోజన పథకంం, వెలుగు, ఉపాధిహామీ నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష, ఇతర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం చట్టబద్ధం చేయాలని కోరారు. నూతన పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు.ఉపాధి పథకంలో 200 రోజులు పని కల్పించాలన్నారు.కోవిడ్ విధుల్లో మరణించిన అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల వారికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్ పి శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, అంగన్వాడీవర్కర్స్ యూనియన్ నాయకులు బావమ్మ, శ్రీదేవి , సావిత్రమ్మ, మాబున్నీసా, నగర పంచాయతీ కార్మికుల్ణ యూనియన్ నాయకులు చిన్న వెంకటేష్, మనీ ,సూరి తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని శ్రామిక మహిళాసంఘం జిల్లా కార్యదర్శి దిల్షాద్ అన్నారు. ఈనెల 28, 29 వ తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దిల్షాద్‌తో పాటు సిఐటియు నాయకులు సాంబశివ, లక్ష్మీనారాయణ, హరినాథ్ రెడ్డి, వేమన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రామకృష్ణ, రమేష్, ఫాజిల్, బబ్లు, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు మాబున్నీసా, రంగమ్మ, భాగ్యమ్మ, సుజాత, ఆశ యూనియన్ నాయకురాళ్లు సావిత్రి, కళావతి వేదవతి, అంజనమ్మ, శకుంతల, మున్సిపల్ యూనియన్ నాయకులు తిరుపాలు, జనార్ధన్ సివిల్ సప్లై యూనియన్ నాయకులు శివ, ఫక్రుద్దీన్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు అంజి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా జాతీయ నాయకురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దిల్షాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28,29 న రెండు రోజుల పాటు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు సామాన్య, మధ్యతరగతి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ధర్మవరం రూరల్ : ఈనెల 28 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ కోరారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవోహోంలో సిఐటియు మండల కార్యదర్శి టి. అయూబ్ ఖాన్ అధ్యక్షతన ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు జెవి. రమణ, రైతు సంఘం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ఆటో రంగం జిల్లా కార్యదర్శి పేడవల్లి బాబా, సిపిఎం పట్టణ నాయకులు ఎస్ హెచ్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28 29 నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజన పథకం యూనియన్ జిల్లా అధ్యక్షులు పి నారాయణ, ధర్మవరం మండల అధ్యక్షులు ఆదినారాయణ, ఆటో రంగం జిల్లా నాయకులు రఫీ, బాబు, రవి, రాము, కొత్తపేట రఫీ, మీటర్ రీడర్స్ నాయకులు దస్తగిరి, కొండ, కిరణ్, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు వెంకటరాముడు, నాగభూషణ, ముత్యాలమ్మ, పెద్దక్క, హమాలీ యూనియన్ నాయకులు కదిరప్ప, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.










