ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు కోరారు. సమ్మె ప్రచారయాత్ర జాతాకు స్థానిక బ్రహ్మానంద మార్కెట్‌లో సిఐటియు అనుబంధ సంఘాలు బుధవారం స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్టీకరణ వద్దని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ నిలుపుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగాల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతోందన్నారు. సగటున ప్రభుత్వరంగంలో 50 శాతం కాంట్రాక్టు కార్మికులే ఉన్నారని తెలిపారు. రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర, గ్యారంటీ చట్టం కల్పించాలని కోరారు. మోడీ అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ, కె.విజయలక్ష్మి, ఎ.శ్యామలారాణి పాల్గొన్నారు.
పెంటపాడు : ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆర్.లింగరాజు కోరారు. ఈ నెల 21వ తేదీ జంగారెడ్డిగూడెంలో బయలుదేరిన ప్రచారజాతా బుధవారం పెంటపాడుకు చేరింది. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ బిజెపి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రెండు రోజులు నిర్వహిస్తున్న ఈ సమ్మెలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిర్లపుల్లారెడ్డి, సత్తి కోదండరామిరెడ్డి, కర్రి సాయిరెడ్డి, ఎస్‌ఎస్‌వి.రెడ్డి, కర్రి సుబ్బిరెడ్డి, వెంకటరావు, కృష్ణ, దుర్గ, అనురాధ, ప్రసాద్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి యోగిరాజు కోరారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను బిజెపి కట్టుబానిసలను చేసిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ, మడక రాజు, తాడికొండ వాసు, ధనాల వెంకటరావు, సత్తి కోదండరామిరెడ్డి, చల్ల చంద్రరావు, కొరడా వెంకటేశ్వరరావు, ఆర్.లోవరాజు, ఎం.రమణ, పైడియ్య పాల్గొన్నారు.
చాగల్లు : సమ్మెలో భాగంగా చాగల్లులో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నేత కె.పోశమ్మ, నాయకులు శ్రీదేవి, సుధారాణి, భాగ్య లక్ష్మి, ప్రమిల, వెంకటలక్ష్మి, దుర్గ, మేకా రత్తమ్మ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాసంఘల కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె గోడ పోస్టర్‌లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి.అరుణ, నాని, ఆశీర్వాదం, సునీల్ పాల్గొన్నారు.
భీమడోలు : సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.లింగరాజు కోరారు. సిఐటియు ప్రచార జాతా బుధవారం సాయంత్రం భీమడోలు చేరుకుంది. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేతలు కె.విజయలక్ష్మీ, ఎ.శ్యామలారాణి, ఐలు జిల్లా నాయకులు పి.రాజారావు, విఆర్‌ఎల సంఘం జిల్లా నాయకులు కె.బ్రహ్మాజీ, కెవిపిఎస్ మండల కన్వీనర్ సుమన్‌బాబు, సిఐటియు మండల నాయకులు వై.సాల్మన్ రాజు, బి.స్వర్ణకుమారి పాల్గొన్నారు.
ఏలూరు కల్చరల్ : కార్మికవర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, మోడీ అమిత్‌షా ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీలలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యువి పిలుపునిచ్చారు. బుధవారం కొత్తూరు జూట్ మిల్లు వద్ద జరిగిన గేటు మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నాయకులు ఎస్.రంగారావు, వై.నాగేశ్వరరావు, పల్లి శ్రీను, రాము, బాలాజీ, సూరి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఏలూరు కల్చరల్ : దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి, సిఐటియు నగర కమిటీల సమావేశం ఉద్యోగులకు, కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ఎఐటియుసి జిల్లా కార్యాలయంలో బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం ఉభయ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమ్మె ఏర్పాట్లను చర్చించారు. 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ ఆఫీసు వద్ద నుండి మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని, 28వ తేదీ ఉదయం 9 గంటలకు పవర్ పేట రైల్వే స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకూ కార్మిక సంఘాల ర్యాలీ, 29వ తేదీ ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీసు వద్ద నుండి ఎల్‌ఐసి ఆఫీస్ వరకూ కార్మిక ర్యాలీ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమ్మెలో బ్యాంకు, ఎల్‌ఐసి, పోస్టల్, ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు, వివిధ రంగాల కార్మికులు పాల్గొంటారని సమావేశం తెలిపింది. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు బి. సోమయ్య,పి. కిషోర్, జగన్నాధ రావు, వి.సాయిబాబు, ఎఐటియుసి నాయకులు అప్పలరాజు, పి.కన్నబాబులు పాల్గొన్నారు.










