ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాలు, స్వతంత్ర పారిశ్రామిక, ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు ఈనెల 28, 29వ తేదీన చేపడుతున్న సార్వత్రిక సమ్మె, గ్రామీణ హర్తాళ్‌ను జయప్రదం చేయాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యాన నగరంలోని దాసరి భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అధ్యక్షతన మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.నర్సింహులు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ జాతీయోద్యమ కాలం నాటి నుంచి కార్మికవర్గం సాధించుకున్న అనేక సంక్షేమ చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేసి, వాటి స్థానంలో కార్మికులకు నష్టదాయకంగా లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ లేబర్ కోడ్‌లతో కార్మికవర్గానికి గతంలో ఉన్న అనేక హక్కులు, సంక్షేమ పథకాలు, సౌకర్యాలు రద్దు చేయబడతాయన్నారు. సమ్మె హక్కును, సమిష్టి బేరసారాల హక్కునూ అదుపు చేసేలా లేబర్ కోడ్‌లు రూపొందించబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌తో సహా దేశంలోని అన్ని ప్రభుత్వరంగ పరిశ్రమలు, బ్యాంకులు, జీవిత బీమా, రైల్వేలు తదితర ప్రజా ఉపయోగ సంస్థలను ప్రయివేటీకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలను ఇప్పటికే కార్మిక సంఘాలు, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. జాతి సంపదను వ్యక్తులపరం చేయడం ద్వారా దేశానికి, ప్రజలకు బిజెపి ద్రోహం చేస్తోందన్నారు. జాతీయ నగదీకరణ (మానిటైజేషన్), భూ నగదీకరణ పేరిట విలువైన ప్రజా ఆస్తులు, రహదారులు, నావికా, వైమానిక కేంద్రాలు, ప్రాజెక్టులను నామమాత్ర లీజుతో దీర్ఘకాలం పెట్టుబడిదారులకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఖండించారు. కార్మికుల కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా కోరుతున్నా ఖాతరు చేయని మోడీ ప్రభుత్వం, ఉన్న వేతనాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులకు వేతన సవరణ చేయాలని, రూ.26 వేలు కనీస వేతనంగా నిర్ణయించి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, రోజు వారీ, కంటింజెంట్, టైమ్ స్కేల్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ ఈనెల 24న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎస్‌పికి వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో వామపక్షాల నాయకులు పోలాకి ప్రసాద్, చిక్కాల గోవిందరావు, పి.తేజేశ్వరరావు, కె.అప్పారావు, బి.అప్పలనాయుడు, జి.రాజేశ్వరరావు, ఎన్.వి రమణ, ఎస్.కృష్ణవేణి, ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యాన...
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ నగరంలోని పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఉద్యోగ, కార్మిక సంఘాల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘ నాయకులు ఎం.గోవర్థనరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు చిక్కాల గోవిందరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి, పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు కె.గణపతి, పి.జ్యోతీశ్వరరావు, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డుపర్సన్స్ అసోసియేషన్ నాయకులు పి.పార్వతీశం, ఎం.ఆదినారాయణమూర్తి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.










