Mar 22,2022 21:19

మాట్లాడుతున్న సిఐటియు పట్టణ అధ్యక్షుడు కసాపురం రమేష్‌

            గుంతకల్లు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29వ తేదీల్లో చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పాల్గొనాలని సిఐటియు పట్టణ అధ్యక్షుడు కసాపురం రమేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రయివేటు లెక్షరర్లు, టీచర్స్‌ అసోషియేషన్‌ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తుతో ఉపాధి కోల్పోయిన ప్రయివేట్‌ టీచర్లు, లెక్చరర్లను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వెంటనే వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో ప్రయివేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆయా యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేదన్నారు. దీంతో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరోనా కాలంలో ఆకలితో సుమారు 30 మంది వరకు ప్రయివేట్‌ ఉపాధ్యాయులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కావున ప్రయివేట్‌ టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఇతర అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొంటే తమ హక్కులను కొంతైనా సాధించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రయివేట్‌ ఉపాధ్యాయులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కనీస వేతనం నిర్ణయించి, ఈఎస్‌ఐ, పి.ఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకోవాలని, హెల్త్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చి, గహ నిర్మాణానికి రుణాలు ఇవ్వాలనే డిమాండ్లతో ఈనెల 28,29 తేదీల్లో జరుగనున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రయివేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ అసోసియేషన్‌ డివిజన్‌ అధ్యక్షుడు డి.గోపీ, క్రిష్ణ, డివిజన్‌ కార్యదర్శి ఎం.హరినాథ్‌, గోపీ, సురేష్‌, బాషా, రెహమాన్‌, రంగస్వామి, తదితర లెక్చరర్లు పాల్గొన్నారు.