Mar 21,2022 00:50

కంచరపాలెంలో సమ్మెకు మద్దతు తెలుపుతున్న ఐద్వా కార్యకర్తలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రచారం హోరెత్తింది. పలుచోట్ల పోస్టర్లును ఆవిష్కరించారు. సమావేశాలు నిర్వహించారు.
ప్రజాశక్తి - పరవాడ : ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరవాడ ఫార్మా సిటీ ఐఒసి వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కర్రి ఎంకి నాయుడు, కె.రమణ, కె.అప్పలరాజు, వై.అప్పారావు, పి.చిన్నారావు, పెంటారావు, దారబాబు, రాజు, తదితరులు పాల్గొన్నారు
అనకాపల్లి : సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ గౌరవ అధ్యక్షులు కుమారి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు : సిఐటియు పాడేరు మండల కమిటీ ఆధ్వర్యంలో శెట్టి నాగరాజు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. మోడీ విధానాల వల్ల అంబానీ, అదానీ వంటి వారు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు. సమ్మె జయప్రదానికి అంరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు వి.భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్తల యూనియన్‌ కార్యదర్శి వై.మంగమ్మ, విఒఎల సంఘం డివిజన్‌ అధ్యక్షులు భాను, ఎల్‌.సుందరరావు, అర్జున్‌, సూరిబాబు, ముత్యాలమ్మ, కొండలరావు, అంబలమ్మ తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు : డౌనూరు పంచాయతీ ముల్లుమెట్ట గ్రామంలో పి.బొంజన్న అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సిఐటియు నాయకులు వై.అప్పల నాయుడు, బి.కృష్ణ, పి.బాలరాజు మాట్లాడారు. ఉపాధి హామీ మేట్లు జె.చంద్రకళ, జె.రమాదేవి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కంచరపాలెం: ఈనెల 28, 29 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి పిలుపునిచ్చారు. బిన్‌ఆర్‌ భవనంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, కార్మిక చట్టాల మార్పు, పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. బిజెపి 2వ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై భారాలు మోపి, సంక్షేమానికి కోతలు పెడుతుందని మండిపడ్డారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత ఆర్ధిక సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కో లేదన్నారు.దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఈనెల 28న విశాఖ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొట్టా ఈశ్వరమ్మ, కె.మణి, కె.కుమారి, బి.భారతి, డి.కొండమ్మ, డి.లావణ్య, కె.సంతో షం, లక్ష్మి, కామేశ్వరి, వరలక్ష్మి, మౌనిక పాల్గొన్నారు.
గాజువాక:ఈనెల 28, 29 తేదీల్లో చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని 70వ వార్డ్‌ సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం,రాంబాబు, టిపి నర్సింగ్‌ రావు, రాజు, రామకృష్ణ, పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌:ఈ నెల 28, 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు కోరారు. స్థానిక మున్సిపాలిటీ వాటర్‌ సప్లరు యూనియన్‌ (సిఐటియు) సమావేశం ఆదివారం మున్సిపాలిటీ బలిఘట్టంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిగర్ల రాజు మాట్లాడుతూ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ ఎం.అప్పలనాయుడు, సెక్రటరీ మహేష్‌, ఎస్‌.నాయుడు, ప్రకాష్‌, మురళి, కృష్ణా, దుర్గా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.