శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-కావలి : 4వ డివిజన్ శానిటైజేషన్ ఇన్‌స్పెక్టర్ కార్మికులకు లోన్లు ఇప్పిస్తానని, కార్మికులను ప్రలోభ పెడుతూ, తరచుగా ఇబ్బందులకు గురి చేస్తున్నందున ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సిఐటియు నాయకులు ఇన్‌ఛార్జి కమిషనర్ యు.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్ మాట్లాడుతూ శానిటైజేషన్ ఇన్‌స్పెక్టర్ గతంలో కూడా కార్మికులను కూడా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని రెండుసార్లు ఫిర్యాదు చేసి ఉన్నామని తెలిపారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పులేదన్నారు. ఇప్పుడు మళ్లీ కార్మికులను వయస్సు పైబడిందని, పనులకు ఆపివేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇదేమని కార్మికులు ఆయనను ప్రశ్నిస్తే రకరకాలుగా కార్మికులను ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. ఇన్‌స్పెక్టర్ స్వలాభం కోసం ఒక్కొక్క కార్మికులకు మూడున్నర లక్ష రూపాయలు బ్యాంకు లోన్లు ఇప్పిస్తామని, ప్రలోభ పెడుతున్నాడని, గతంలో ఈయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల మితిమీరి పోతున్నాడని దుయ్యబట్టారు. ఆయన బాటలో మరోపక్క సచివాలయ కార్యదర్శి మూడవ డివిజన్‌లో మస్టర్ వేసే అధికారి డిఎం ఆఫీసు నుండి కాగితాలు వచ్చాయని, 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న కార్మికులను పర్మినెంట్ చేస్తారని అందుకు ఆధార్, జిరాక్స్ ఓటిపి నెంబర్లు ఇవ్వాలని, అంతే కాకుండా రెండు లక్షల రూపాయలు బ్యాంకు లోన్లు ఇస్తామని, మస్టర్ పాయింట్లోనే బహిరంగంగా చెబుతూ కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకుపోగా, ఈ విషయాలు తనకు తెలియదని, విచారించి తగు చర్యలు తీసుకుంటానని చెప్పారన్నారు. ఇలా కార్మికులను గందరగోళానికి గురి చేస్తున్న ఇద్దరిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై త్వరలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు మధుసుధనరావు, బి.కృష్ణయ్య, కార్మికులు పాల్గొన్నారు.










