శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-కావలి : కావలి మున్సిపాలిటీ 4వ డివిజన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగా కార్మికులను విధులలో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నందున ఆయనపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు మంగళవారం కమిషనర్ బి.శివారెడ్డికి అర్జీ అందజేశారు. అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్ మాట్లాడుతూ 4వ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగానే కార్మికులను పనులలో ఇబ్బందులు పెడుతూ తరచుగా మహిళలు అనికూడా చూడకుండా ట్రాక్టర్లకు విధులకు పంపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. అంతేకాకుండా సెలవు రోజులలో కూడా కార్మికులతో పనులు చేయించుకొని కార్మికులకు అవసరమైన రోజు సెలవడిగితే ఇవ్వడం లేదన్నారు. ముఖ్యంగా పండగ సెలవులు ఉన్నప్పటికీ ఆ సెలవులు కూడా కార్మికులు ఇవ్వమని అడిగితే మీకు అసలు సెలవులే లేవంటూ బెదిరిస్తున్నాడన్నారు. ఈ విషయాన్ని కార్మికులు ప్రశ్నిస్తే రకరకాలుగా రోజు పనులలో ఇబ్బందులు పెడుతున్నాడన్నారు. ఆయన గత రెండు నెలల క్రితం ఇలాగే వ్యవహరిస్తే, అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇప్పటికైనా కమిషనర్ వెంటనే ఆయన పైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో ఉన్నత అధికారులు దృష్టికి తీసుకొని వెళ్తామని, పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.కృష్ణయ్య, యూనియన్ నాయకులు తురక శీనయ్య, బిరదల మహేష్, జలదంకి బాబు, ఒంగోలు రమేష్, పాముల సీనయ్య, పరుసు చిన్నమ్మ, తదితర కార్మికులు పాల్గొన్నారు.










