Jan 27,2023 21:37

ఫొటో : మాట్లాడుతున్న ఆర్‌డిఓ వి.కె.శీనానాయక్‌

శానిటైజేషన్‌ పనులు అధ్వానం : ఆర్‌డిఒ
ప్రజాశక్తి - కావలి : ఏ మున్సిపాలిటీలో లేనివిధంగా కావలి మున్సిపాలిటీలో శానిటైజేషన్‌ అధ్వానంగా ఉందని, ప్రజాసమస్యలపై అశ్రద్ధగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకుంటానని కావలి ఆర్‌డిఒ కావలి మున్సిపాలిటి ప్రత్యేకాధికారి వి.కె.శీనానాయక్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కావలి మున్సిపల్‌ కార్యాలయంలో డి.ఇ.శ్రీనివాసరావు, టిపిఎస్‌ బాబూరావు, 4డివిజన్ల శానిటరి ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో శానిటైజేషన్‌పై నెగటివ్‌ వార్తలు వస్తున్నాయని, తగిన శ్రద్ధ తీసుకోవాలని కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తనను కోరారని, స్పెషల్‌ గ్రేడు మున్సిపాలిటీ కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. అందుకు అనుగుణంగా మున్సిపాలిటీని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కావలి మున్సిపాలిటీని స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీకి ప్రతిపాదనలు పంపేందుకు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే, సహించేది లేదన్నారు. శానిటైజేషన్‌, పందుల బెడద, వీధిలైట్లు, తదితర సమస్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అందుకు సంబంధించి తనకు ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా, అందుకు బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.