Jan 19,2023 21:53

విలేకరులతో మాట్లాడుతున్న డిఐజి రవిప్రకాష్‌

        పుట్టపర్తి రూరల్‌ : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం రేంజ్‌ డిఐజి రవిప్రకాష్‌ హెచ్చరించారు. గురువారం సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఐజి మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే ఎస్పీ కార్యాలయం పనితీరు బాగుందని సంతప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీలు, కానిస్టేబుళ్ల కొరత ఉందని, త్వరలోనే వాటి భర్తీకి కషి చేస్తామన్నారు. జిల్లాలో కదిరి, హిందూపురం పట్టణాల్లో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, సున్నితమైన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఫ్యాక్షన్‌ గ్రామాలు ఉన్నాయని వాటిపై నిరంతర నిఘా ఉంచామన్నారు. మహిళలపై అత్యాచారాలు, పిల్లల కిడ్నాప, ఇతర ప్రాంతాల నుంచి మద్యం తరలింపు, నాటుసారా తయారీ, దొంగతనాలు, హత్యలు తదితర కేసులను త్వరగతిన ఛేదించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ అవసరం ఉందని, త్వరలోనే ట్రాఫిక్‌ పోలీసును నియమిస్తామన్నారు. పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగనివ్వకుండా పోలీస్‌ గస్తీ నిరంతరం ఉంటుందన్నారు. వీఐపీలు వస్తుంటారని అందుకు తగిన బందోబస్తు నియమిస్తామన్నారు. ప్రజలలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఎస్పీకి సూచించామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌పి రాహుల్‌ దేవ్‌ సింగ్‌, అదనపు ఎస్‌పి రామకృష్ణ ప్రసాద్‌, డీఎస్పీ ఉమామహేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.