Jan 14,2023 21:27

స్టేషన్‌ బయట గుమికూడిన వైసిపి నాయకులు

              ప్రజాశక్తి-హిందూపురం    రాజకీయాలు ఏమైనా ఉంటే వాటిని ఆ మేరకే చూసుకోవాలని, దానిని అడ్డం పెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హిందూపురం ఇన్‌ఛార్జి డీఎస్పీ యశ్వంత్‌ అధికార పార్టీ కౌన్సిలర్లను హెచ్చరించారు. పట్టణంలో శుక్రవారం అధికార పార్టీ కౌన్సిలర్లు మధ్య బాహాబాహాకి జరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు ఇర్షాద్‌, రోషన్‌ అలీలను శనివారం నాడు పోలీసు స్టేషన్‌కు రమ్మని పిలిపించారు. ఈ సమయంలో కౌన్సిలర్‌ శివ తరపున ఇతర కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పెద్ద ఎత్తున స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని రమ్మని పిలిస్తే, ఇంత మంది ఎలా వస్తారని డీఎస్సీ వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. స్టేషన్‌ వద్దకు వచ్చిన నాయకులందరినీ పోలీసులు బయటకు పంపించారు. కౌన్సిలర్లందరినీ డీఎస్పీ లోపలికి పిలిపించి వారితో సుధీర్ఘంగా చర్చించారు. ఈ సమయంలో మీడియాను లోపలికి అనుమతించలేదు. నాయకులు రోడ్ల మీద వివాదాలకు దిగవద్దని వారికి డీఎస్పీ సూచించినట్లు సమాచారం. తాము ఎలాంటి తప్పిదాలు, అసాంఘిక కార్యకలాపాలు చేయడం లేదని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నామని కౌన్సిలర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం స్థల వివాదానికి కారకులైన కౌన్సిలర్లు రోషన్‌ అలీ, ఇర్షాద్‌లతో డీఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.