May 02,2023 21:24

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
సాంప్రదాయేతర పంటల సాగుకు కృషి
నెల్లూరు :సువిశాల తీరప్రాంతం, సారవంతమైన భూముల సౌలభ్యం నేపథ్యంలో సాంప్రదాయేతర పంటల వైపు రైతులను ప్రోత్సహించవలసిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో మత్స్య శాఖ, ఉద్యానవన శాఖల పై కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా లోని మత్స్యకారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సమయానుకూలంగా వారికి అందిస్తూ వారి అభివద్ధికి తోడ్పడాలన్నారు. మత్స్యకార భరోసా లబ్ధిదారులు గురించి విచారించారు. మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలు తీరుతెన్నులను విచారిస్తూ సాగు విస్తీర్ణం పెరగాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని తీరప్రాంతంలో సారవంతమైన భూములున్నందున వైవిధ్యమైన పంటల సాగు వైపు రైతులు ఆకర్షితులయ్యేవిధంగా ఉద్యానవన శాఖాధికారులు కషి చేయాలన్నారు. అరటి సాగు, కూరగాయల సాగు వంటి పంటలు వేస్తే రైతులకు తక్షణ ఆదాయం లభిస్తుందన్నారు. గ్రామాల్లో ఔత్సాహిక రైతులను గుర్తించి ప్రోత్సహిస్తే, వారిని చూసి మరింతమంది రైతులు ఉద్యానవన పంటల సాగు వైపు వచ్చే అవకాశం ఉందన్నారు
. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సాధ్యమవుతుందన్నారు. మార్కెటింగ్‌ చేయుటకు మంచి అనుకూలతలున్న నేపథ్యంలో తప్పనిసరిగా రైతులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయ రైతులను ఉద్యానవన పంటలసాగు వైపు పెద్ద స్థాయిలో మార్చినప్పుడే ఉద్యానవన శాఖ లక్ష్యం నెరవేరుతుందన్నారు. పెద్ద స్థాయిలో ఉద్యాన పంటలు పండించడం, అదే సమయంలో సాగు ఖర్చు గణనీయంగా తగ్గించటం వంటి విషయాలలో రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, ఆరోగ్యవంతమైన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నందున, రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖాధికారి సుబ్బారెడ్డి, ఎ పి యం ఐ పి పిడి శ్రీనివాసులు, మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు