ప్రజాశక్తి-హిందూపురం : అధికార పార్టీ అండతో కౌన్సిలర్లు, ఆ పార్టీ నాయకులు చెలరేగి పోతున్నారు. తమ వార్డుల పరిధిలో తమకు తెలియకుండా ఏదీ చేయరాదంటు అదేశాలు ఇస్తున్నారు. సంబంధింత వార్డు సచివాలయాల్లో వారికి ఏపనైనా తెలయకుండా జరిగినా, మున్సిపల్ అధికారులు సందర్శించిన ఇక వారు అంతే... పునకం వచ్చినట్లు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నోటికి పని చెప్పి చెప్పుకోలేనంత రీతిన అధికారులపై విరుచుకుపడతారు. మరీ కాస్తా మాట జరిగే నాయకులు, కౌన్సినర్లు అధికారులను బదలీ చేయించడం సైతం ఇక్కడ రివాజుగా మారింది. మరి కొంత మంది కౌన్సిలర్లు అయితే తమ పార్టీ అధికారంలో ఉందని, తాము చెప్పినట్లు వినాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. అలా వినక పోతే ఇక్కడి నుంచి వెళ్లి పోవాలంటు ఖరాఖండిగా చెప్తున్నారు. దీంతో మూడేళ్లల్లో ముగురు కమిషనర్లు బదలీ కాగా ముగ్గరు ఇన్‌చార్జ్ కమిషనర్లుగా ఇక్కడ విధులు నిర్వర్తించారు. ఇటీవలే ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ సైతం బదలీ అయ్యారు.
హిందూపురం పురపాలక సంఘం అన్నది ఒక రాజ్యం. వార్డులు అంటే సామంత రాజ్యాలు, తామే కిరీటం లేని రాజులని అధికార పార్టీ కౌన్సిలర్లు అనుకున్నట్లు ఉన్నారు. వార్డులో జరిగే ప్రతి విషయంతో పాటు అభివృద్ధి పనుల నుంచి కనీసం వార్డులో అధికారులు పర్యటించాలన్న వారి అనుమతులు తీసుకోవాల్సిందే. లేదంటే పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. గతంలో సాక్షత్తు మున్సిపల్ కమిషనర్ నూతనంగా నిర్మాణం చేస్తున్న వాణిజ్య భవనాన్ని పరిశీలనకు వెళితే ఆ వార్డు కౌన్సిలర్ భర్త సచివాలయ ఉద్యోగులు సమచారం ఇవ్వలేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి, సచివాలయానికే తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఏమి చేయలేని అధికారులు వీరి వింత పోకడలకు తలలు పట్టుకుంటున్నారు. అధికార కార్యక్రమాలు, ప్రవేటు కార్యక్రమాల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చివరికి పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుపడిన వాహనాలను పోలీసులు వేలం వేయాలన్నా కౌన్సిలర్లకు తెలపాలంటున్నారు. సమాచారం ఇవ్వకుంటే ఆ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నట్లు సమాచారం. దీంతో అధికారులు, ప్రజలు అసహనానికి గురవుతున్నారు. వార్డు కౌన్సిలర్లకు తెలిపే విషయాలైతే తెలుపుతామనిఅనవసర విషయాలు ఎందుకు చెప్పాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీలో నెలకొన్న విబేధాలతో ఈ సమస్యలు మరింత జఠిలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కౌన్సిల్ సమావేశంలో అధికారులు అభివృద్ధిపై రూపొందించిన అజెండాపై కనీస చర్చ సైతం జరపరు. క్షణాల్లో అజెండాకు అమోదం తెలిపి, అనవసర వివిషయాలపై అధికార, ప్రతి పక్ష కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దూషించుకుంటు మధ్యలోనే సమావేశం ముగించి వెళ్లి పోతుంటారు. తమకు అనుకూలంగా ఉన్న అంశాలు అయితే అధికారులపై ఒత్తిడి తెచ్చి, అజెండాలో పొందపరచి, వాటిని వెంటనే ఆమోదం తెలుపుతారన్న విమర్శలున్నాయి. దీనికి నిదర్శనం గడువు ముగిసిన ఆరు నెలలకు, ఇంకా గడువు ఉండగానే కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఇచ్చిన సామూహిక మరుగుదోడ్లతో పాటు కూరగాయాల హోల్ సేల్ వ్యాపారులకు, పూల వ్యాపారులకు పురపాలక సంఘం ఆద్వర్యంలో నూతనంగా నిర్మాణం చేసిన వాణిజ్య భవనం కింద పూల వ్యాపారులకు కేటాయించిన స్థలాలే. ఇందులో రూ. కోట్లు ముడుపుల రూపంలో తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు వార్డులో ఎవరైన నూతనంగా గృహం నిర్మించుకోవాలంటే వారి వార్డు రాజును ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇక సచివాలయ ఉద్యోగులైతే మరింత వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో ప్రతి కార్యదర్శి వీరి అనుమతి లేకుండా ఏమి చేయడానికి వీల్లేదు. అర్హులు కార్యాలయాల చుట్టు తిరిగి, విసిగి పోకూడదని ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, సుపరిపాలన అందిస్తున్న తరుణంలో కొంత మంది అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఇలా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది.










