ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్ సామాజిక న్యాయమే లక్ష్యం వైసిపి ప్రభుత్వం పని చేస్తోందని పలువురు మంత్రులు అన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వైసిపి ప్రారంభించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం కాకినాడకు చేరుకొంది. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్‌లో ఎంఎల్‌ఎ కన్నబాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూప్, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎంఎల్‌ఎ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సాధికారత, బడుగులకు రాజ్యాధికారాన్ని సాకారం చేసిన ఘనత సిఎం జగన్‌కే సాధ్యమన్నారు. చంద్రబాబు పాలనలో సామాజిక న్యాయం ఏమి జరిగిందని ప్రశ్నించారు. సామాజిక న్యాయంలో జగనన్న ముందు తర్వాతగా చూడాలన్నారు.










