కడప జిల్లాలో 67, అన్నమయ్యలో 47 శాతం
లక్ష్యాన్ని చేరని వరి, వేరుశనగ, పత్తి
కడప ప్రతినిధి : రబీ సీజన్ సా..గుతోంది. జిల్లాలోని 36 మండలాల్లో నాలుగో వంతు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన 28 మండలాల్లో 25 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడం ఊరట కలిగించింది. ఈలెక్కన మిగిలిన మూడు మండలాల్లోనే పూర్తిస్థాయి వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తోంది. ఇటువంటి వర్షాభావ పరిస్థితుల్లో వరి, వేరుశనగ, పత్తి పంటల సాగు లక్ష్యాన్ని చేరుకోవడంలో మూడో వంతుకు పరిమితం కావడం ఆందోళన కలిగి స్తోంది. ఈలెక్కన సాగు శాతాన్ని పరిశీలిస్తే కడప జిల్లాలో 67 శాతం, అన్నమయ్య జిల్లాలో 47 శాతం విస్తీర్ణంలో మాత్రమే విత్తనం పడింది. మిగిలిన 53 శాతం సాగు వర్షాభావ పడగ నీడన ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
కడప జిల్లాలో రబీ సీజన్ నత్తనడకన సాగుతోంది. 2022-23 రబీలో 3,77,030 ఎకరాల్లో పంటలు సాగు చేయాలనేది జిల్లా వ్యవ సాయశాఖ లక్ష్యం. నవంబర్ ఒకటి నుంచి జనవరి నెలాఖరు వరకు సాగు చేయాల్సి ఉంది. నవంబర్‌లో 19.4 డిసెంబర్‌లో 268 శాతం లోటు వర్షపాతం నెలకొన్న ఒడిదుడుకుల నేపథ్యంలో మందకొడిగా సాగుతోంది. నవంబర్ నుంచి నేటి వరకు 28 మండలాల్లో ఆశాజనకంగా వర్షపాతం నమోదు కావడంతో 2.53.230 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మరో 1,23,800 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. ఈలెక్కన సాగు తీరుతెన్నలను పరిశీలిస్తే 67 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కావాల్సి ఉంది. అన్నమయ్య జిల్లాలో సాగు పరి స్థితులను పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్స రంలో 1,71,822 ఎకరాల సాధా రణ సాగు లక్ష్యానికి గానూ 81,802 ఎకరాల్లోనే విత్తనం పడినట్లు తెలు స్తోంది. ఈలెక్కన 47 శాతం మాత్రమే సాగు చేసినట్లు తెలుస్తోంది. వర్షా భావ పరిస్థితుల నేపథ్యంలోనే మిగిలిన 53 శాతం సాగుకు నోచు కోవడం లేదనే వాదన వినిపిస్తోంది.
బద్వేల్‌లో లోటు వర్షపాతం
బద్వేల్ డివిజన్‌లోని కాశినాయన, పోరుమామిళ్ల, కలసపాడు, మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సదరు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం రబీ సీజన్‌లో పంటల సాగు మందగించింది. నవంబర్ డిసెంబర్‌లో లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో సాగు లక్ష్యంపై ప్రభావం చూపించింది. రబీ సీజన్‌లో పంటల సాగు దశ నుంచి నేటి వరకు 639.2 మి.మీ వర్షపాతం నమో దు కావాల్సి ఉండగా 632.7 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఈలెక్కన కడప జిల్లా వ్యాప్తంగా -6.3 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా సానుకూల, లోటు వంటి మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రబీ సీజన్ సాగు లక్ష్యాన్ని చేరుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నా యి.
తగ్గిన సిరి ధాన్యాల సాగు!
జిల్లాలో సిరిధాన్యాల సాగు తగ్గుముఖం పట్టింది. జిల్లా వ్యాప్తంగా 37,205 ఎకరాల్లో 30 రకాల పంటల్లో సిరిధాన్యాలు సాగు ప్రశ్నార్థకంగా మారింది. కొర్రలు, అరికెలు, సోమలు, వరిగ, ఊదలు వంటి సిరిధాన్యాల 12,674 ఎకరాలకు పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. సిరిధాన్యాల సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో సాగుకు అవకాశమే లేకుండా పోయినట్ల తెలుస్తోంది. వీటిని మినహాయిస్తే జిల్లాలోని ప్రధాన ఆహార పంటలైన వరి 27,795 ఎకరాలు, బుడ్డశనగ 2,42,035 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 1,77,405 ఎకరాల్లో, జొన్న 24,610 ఎకరాలు, వేరుశనగ 20,630 ఎకరాలు, పత్తి 5004 ఎకరాల్లో మూడో వంతు సాగుకు నోచుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదిలాఉండగా మినుములు 15,925 ఎకరాల్లో సాధారణ సాగు లక్ష్యానికి గానూ 28,338 ఎకరాల్లో రెట్టింపు సాగు కావడం ఊరటను కలిగిస్తోంది.
రబీ లక్ష్యాన్ని అధిగమిస్తాం
రబీ సాగు లక్ష్యాన్ని చేరుకుంటాం. నేటికి 67 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మిగిలిన 33 శాతంలో పంటల సాగు కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమిస్తాం
- నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి, కడప.










