Feb 08,2023 22:03

వెంకటరెడ్డిపల్లి సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న పేద రైతులు

          పనుకొండ : ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న పేద సాగు రైతులందరికీ వెంటనే పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లాలోని పలు సచివాలయాల వద్ద బుధవారం నాడు ఆందోళన చేపట్టి, సిబ్బందికి వినతిపత్రాలు అందజేశారు. పెనుకొండ నగర పంచాయితీ పరిధిలోని వెంకటరెడ్డి పల్లి సచివాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సాగుదారులందరికి అసైన్మెంట్‌ చేసి భూ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇస్లాపురం గ్రామానికి చెందిన దళితులు,వెనకబడిన వర్గాలకు చెందిన భూమిలేని 120 నిరుపేద కుటుంబాలు గొందిపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్‌ 164లోని దాదాపు 300 ఎకరాల భూమిని చేసుకుంటున్నారన్నారు. పరిశీలించి సాగుదారులందరికీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన 8వ విడత భూ పంపిణీలో అసైన్మెంట్‌ చేసి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జయంతి, రామాంజనమ్మ, సాగుదారులు రాజు, బైలాంజనేయులు, అంజి, రాజశేఖర్‌, నాగరాజు, సురేష్‌, రత్నమ్మ, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : మండల కేంద్రానికి చెందిన భూమిలేని దళిత, వెనుకబడిన వర్గాలకు ఎనిమిదో విడత భూ పంపిణీలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు బాధితులు స్థానిక రెండవ సచివాలయంలో బుధవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వ్యక్తిగత ఆర్జీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు హనుమయ్య, వెంకటేష్‌, రంగప్ప, కొండా వెంకటేశులు, సాగుదారులు శ్యామల, గంగమ్మ, అమత, అలివేలమ్మ, సరోజ, వరలక్ష్మి, నాగమ్మ, శివమ్మ, సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
నల్లమాడ : భూ పంపిణీ కార్యక్రమాన్ని అసైన్మెంట్‌ కమిటీ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తామని సాగుదారులకే భూమిని పంపిణీ చేస్తామని తహశీల్దార్‌ దేవేంద్ర నాయక్‌ తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సునీత బారు అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో భూ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కొండగుట్టలకు భూపంపిణీలో ఆస్కారం లేదన్నారు. సాగు చేసుకుంటున్న వారికే భూ పంపిణీ చేస్తామన్నారు. గ్రామ సచివాలయాల పరిధిలోని అధికారులు, ప్రతినిధుల కమిటీ ద్వారా ఈ పంపిణీ సాగిస్తామన్నారు. ఎంఇఒ వేమ నారాయణ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ప్రత్యేక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బడి మానేసిన విద్యార్థులను ఈ విద్యా కేంద్రంలో చేరేలగా అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. రబీ సాగు పంటలను తప్పనిసరిగా ఈ క్రాప్‌ బుకింగ్‌ చేయించాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని సుమతి కోరారు. రైతు సంఘాల సభ్యులు ప్రభుత్వం అందించే ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు కాలసముద్రం సూర్యనారాయణ, ఎంపీడీవో రామచంద్రారెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.