ప్రజాశక్తి -పెనుకొండ : ఇంటి పట్టాదారులు, సాగుభూమి దారులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో రొద్దం, సోమందేపల్లి, పెనుకొండ మండలాలకు చెందిన ప్రభుత్వ వ్యవసాయ భూమి సాగుదారులు , సోమందేపల్లి నక్కలగుట్ట ఇండ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొన్నారు. మునిమడుగు దళితుల శ్మశాన భూమి ఆక్రమణను కాపాడాలని దళితుల కోసం శ్మశాన స్థలం కేటాయించాలని కొండాపురం గ్రామ దళితులు కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నక్కల గుట్టలో ఇంటి నిర్మాణాలకు అనుమతించాలని, హైకోర్టు ఉత్తర్వులు అమలుపరచాలని, దళితుల శ్మశాన భూమి ఆక్రమణ ఆపాలని డిమాండ్ చేశారు. పేదల పట్ల ఆయా మండల తహశీల్దార్ల మోసపూరిత వైఖరి నశించాలని నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటలసేపు ఆందోళన కొనసాగినా సబ్ కలెక్టర్ స్పందించకపోవడంతో సహనం కోల్పోయిన బాధితులు సబ్ కలెక్టర్ చాంబర్లోకి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే వున్న సిఐ, ఎస్‌లు వారించారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు నారాయణ బాలస్వామి , వెంకటరాముడు, కెవిపిఎస్ హనుమయ్య, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశులు, రంగప్ప, తిప్పన్న, సోమందేపల్లి సిఐటియు నాయకులు కొండా వెంకటేశులు , నాగభూషణ, మాబు తదితరులు పాల్గొన్నారు.










