Dec 28,2022 09:00

సాగుదారులతో కలిసి పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న వ్యకాసం నాయకులు

         పెనుకొండ : రొద్దం మండలంలో నిరుపేద సాగురైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న తహశీల్దార్‌పై చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. నిరుపేద సాగుదారులపై రొద్దం మండల తహశీల్దార్‌ వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ దశాబ్దల తరబడి రొద్దం మండలం కోగిర గ్రామంలో 666 నుంచి 669 సర్వే నంబర్‌ వరకు దాదాపు 200 మంది భూమిలేని నిరుపేద దళిత, గిరిజన, బలహీన వర్గాల పేద రైతులు భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ భూములకు పట్టాలు ఇవ్వాలని సాగుదారులు అనేక ఏళ్లుగా అధికారులను కోరుతున్నారని చెప్పారు. దీనిపై ప్రస్తుత రొద్దం తహశీల్దార్‌ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సాగుదారులకు అన్యాయం చేసేలా ఆయన వైఖరి ఉందన్నారు. గత తహశీల్దార్‌ నివేదికలు, సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యక్తిగత నిర్ణయాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా వెబ్‌ల్యాండ్‌ రికార్డుల మేరకు సాగుదారులు లేరని, అసలు ప్రభుత్వ భూమే లేదని తప్పుడు నివేదికలు ఇస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నాడని తెలిపారు. వ్యకాసం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తహశీల్దార్‌ దళితులు, గిరిజనుల పట్ల చిన్నచూపు చూపిస్తున్నారన్నారు. పేదలకు అన్యాయం చేస్తూ అధికార పార్టీ నాయకులు, భూస్వాములకు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న తహశీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుని, పేదలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సాగుదారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయిస్తామని తెలిపారు. తాను కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని తెలిపారు. అర్హులైన సాగుదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి, నారాయణ, సాగుదారులు నరసింహమూర్తి, సుబ్రహ్మణ్యం, కిష్టప్ప, మారుతి, నాగార్జున పాల్గొన్నారు.