Oct 13,2022 15:43

ప్రజాశక్తి-వత్సవాయి : మండలంలోని సమీప గ్రామాలైన పాతవేమవరం నుండి పెనుగంచిప్రోలుకు వచ్చే తువ్వకాలువ కట్ట రోడ్డు నిత్యం రద్దీగా ఉండే రోడ్లు. సమీప రాష్ట్రమైన తెలంగాణ ప్రాంతం నుండి ఈ గ్రామాల మీదుగానే పెనుగంచిప్రోలు రావాల్సి ఉంది. కానీ ఈ రోడ్ల మీద ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. అసలే పాడైపోయిన రోడ్లు, ఆపై వర్షాల వలన ధ్వంసమైన ఈ రోడ్లపై కనీసం ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు కూడా వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారింది. వర్షం వస్తే గుంటల్లో నిలబడిన నీళ్లకు ఎక్కడ ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు ప్రయాణికులు ప్రమాద బారిన పడిన సంగతి కూడా తెలిసిందే. ఈ రహదారి గుండా బోనకల్, నాగులవంచ, ఖమ్మం, వైరా, తల్లాడ, తదితర గ్రామాల నుండి భక్తులు పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంకు వెళ్ళటానికి వస్తుంటారు. ఈ రహదారి దేవాలయంకు అతి సమీపంగా ఉండటంతో భక్తులు ఎక్కువగా ఈ రహదారి గుండా  ప్రయాణిస్తున్నారు.వెంటనే ఆయా రోడ్ల ను ప్రభుత్వం వెంటనే మరమ్మత్తులు చేయాలని, మండలంలోనే కాక నియోజకవర్గ వర్గ స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పలు రోడ్లు దెబ్బతిని ప్రయాణించడానికి ఇబ్బందికరంగా ఉండి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించడం తప్ప కనీసం చేసేది ఏమీ లేకుండా అయిపోయింది. తప్పకుండ ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు జాప్యం చేయకుండా రోడ్లు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.