ప్రజాశక్తి-విజయవాడ
సింగ్ నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్‌ను నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సందర్శించి దాని అభివృద్దికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌లోని ర్యాంప్ క్రింద వర్షపు నీరు నిలబడి, బురదగా ఉండటం, చెత్త తరలింపు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నందున వెట్ మిక్స్‌తో రోడ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను కోరారు. సి.ఎన్.జి వాహనాల సర్వీసింగ్ ర్యాంప్ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు ఎక్సెల్ ప్లాంట్‌లో జరుగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఎటువంటి చోరీలు, ఇతర అక్రమాలు జరగకుండా ప్లాంట్ ఆవరణలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి ప్లాంట్‌కు తరలిస్తున్న కొబ్బరి బొండాలను ముక్కలుగా కట్ చేసిన తరువాతనే ఇక్కడకు తరలించాలన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో కలసి మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోని అవుట్ డోర్ ఇండోర్ స్టేడియంను పరిశీలించారు.










