రాయచోటి టౌన్: రాయచోటి మున్సిపాలిటీలోని రవ్వలగుట్ట చుట్టూ ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. రవ్వలగుట్లలో అక్రమ నిర్మాణాలను సిపిఎం బృందం శుక్రవారం పరిశీలించింది. అనంతరం కలెక్టర్ గిరీషకు అక్రమార్కులపై చర్యలు తీసుకుని, ఆ భూమిని పేదలకు పంచాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామాంజులు మాట్లాడుతూ రవ్వలగుట్టలో స్థానికేతులు, భూస్వాములు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 3, 4, 5 సెంట్ల స్థలంలో పెద్దపెద్ద భవంతులు కడుతున్నారని తెలిపారు. ఫేక్ డీఫారాలు కలిగి అనర్హుల పేరుతో నిర్మించే అక్రమ కట్టడాలు వెంటనే నిలిపేసి ఇళ్లు లేని నిరుపేదలకు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు వాడుకోవాలని సూచించారు. ఆ స్థల అనుభవంలో ఉన్న గిరిజనులే ఇళ్ల నిర్మాణానికి అర్హులని ఉమ్మడి కడప జిల్లా జడ్జి వచ్చి చెప్పినప్పటికీ ఉపయోగం లేదన్నారు. తహశీల్దార్ ప్రభుత్వ స్థలం నా సొంత ఆస్థి కాదు కదా ఎవరూ ఆక్రమించుకుంటే నాకేమిటీ అనుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. 1002 సర్వేలోని 129 ప్లాట్‌కు సంబంధించిన డీ పామ్ ఉన్నా వీఆర్వో అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. ఒక విఆర్‌ఒ అక్రమంగా మూడంతస్థుల భవనం కడుతున్నారని విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలన్నారు. రవ్వలగుట్టలో అక్రమ కట్టడాలు నిలిపే వరకు పేద ప్రజానీకానికి ఇచ్చే వరకు సిపిఎం పోరాడుతున్నదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఫయాజ్, ఆంజనేయులు, గణపతి పాల్గొన్నారు.










