రవాణా రంగ కార్మికులపై చిన్నచూపు..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆటోకార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ విమర్శ
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికులను చిన్నచూపు చూస్తున్నాయని, వీరి సంక్షేమానికి ఎటువంటి చర్యలను చేపట్టడం లేదని ఆటో కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ విమర్శించారు. శుక్రవారం జగదేవిపేట కళ్యాణ మండపంలో ఇందుకూరుపేట, టిపి గూడూరు ఆటో కార్మికులతో జరిగిన విస్తృత సమావేశంలో ముజాఫర్‌అహ్మద్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రవాణా రంగ కార్మికులు 20 లక్షల మంది పైగా ఉన్నారని పన్నుల రూపంలో వీరి వద్ద నుంచి కోట్ల రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తున్న వీర సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టం పేరుతో రవాణా కార్మికులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. ఈ చట్టం వల్ల కార్మికులు జైలుపాలయ్యే అవకాశం ఉందని, తక్షణం ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల రేట్లు ఒకపక్క... ఆర్‌టిఒ పోలీసు అధికారుల చలానాలు మరొక పక్క... రవాణా రంగ కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయన్నారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని దీనికి సమగ్రమైన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి వి వి ప్రసాద్, అజరుకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం పేరుతో ఆటో యజమానులకు మాత్రమే డబ్బులు ఇస్తుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతిఒక్క కార్మికుడికి వాహన మిత్ర పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వాహన మిత్ర పథకం పేరుతో రూ.10వేలను ఆటో కార్మికులకు ఇచ్చి పన్నుల రూపంలో ఒక్కొక్క ఆటో కార్మికుల నుంచి రూ.50 వేలను పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. దీనిపై రాబోవు కాలంలో ఆటో కార్మికులందరూ ఐక్యమై పోరాటం నిర్వహించాలని తెలిపారు. అనంతరం ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజా మాట్లాడుతూ నూతన మోటార్ వాహన చట్టం వ్యతిరేకంగా ఏప్రిల్ 5వ తేదీ సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆటో కార్మికులందరూ జయప్రదం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటించి ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మురళి, లీగల్ అడ్వైజర్ శ్యామ్‌రెడ్డి, ఆటో యూనియన్ జిల్లా నాయకులు మురళి, వెంగయ్య, రాధయ్య మండల నాయకులు చాన్‌బాషా, మనోహర్, టిపి గూడూరు మండలం నరుకూరు సెంటర్ ఆటో యూనియన్ అధ్యక్షులు నాశన పరశురాం, సహాయ కార్యదర్శి గోపి ఉపాధ్యక్షులు వెంకట శేషయ్య ట్రెజరర్ శివ, గంగపట్నం ఆటో స్టాండ్, మైపాడు స్టాండ్ అధ్యక్ష కార్యదర్శులు నర్సింహులు, వెంకయ్య, ప్రసాద్, శాంతన్ కుమార్, మస్తానయ్య బాబు, ప్రభుదాసు, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










