- 'ప్రతి చుక్క-మరింత పంట' నిధులపై గందరగోళం
- తామిచ్చిన రుణ నిధులపై నబార్డ్ ఆరా
- గ్రీన్‌ఛానల్‌లోకి బదిలీ కాలేదంటున్న అధికారులు
- కేంద్రం నుంచి రాష్ట్రంపై పెరుగుతున్న వత్తిడి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : 'ప్రతి చుక్క-మరింత పంట' పథకానికి నబార్డ్ నుంచి వచ్చిన నిధులపై గందరగోళం నెలకొంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం మైక్రో ఇరిగేషన్ ఫండ్ కింద రూ.613 కోట్లు రాష్ట్రానికి నబార్డ్ విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఈ నిధులు ఏమయ్యాయి, దేనికి ఖర్చు చేసారన్నదానిపై స్పష్టత లేకుండాపోయింది. దీనిపై నబార్డ్ కూడా ఆరా తీస్తోంది. ఖర్చు చేశారా, ఇతర అవసరాలకు మళ్లించారా అన్న వివరాలు సేకరిస్తున్న తెలిసింది. అయితే రాష్ట్ర అధికారుల వద్ద కూడా దీనిపై స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు. పలు అత్యవసరాల కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్‌కు కూడా ఈ నిధులు చేరలేదని సమాచారం. చివరకు కొత్తగా కేంద్రం ఆదేశాలతో ఏర్పాటు చేసిన సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకులో కూడా ఈ నిధులు జమ కాలేదని తెలిసింది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద అన్ని రాష్ట్రాలకు పర్ డ్రాప్-మోర్ క్రాప్ విధానం కింద 2019-20 సంవత్సరానికి 613.13 కోట్లను నబార్డ్ ద్వారా విడుదల చేశారు. ఇదే విషయాన్ని 2020 మే నెల్లో నబార్డ్ నుంచి రాష్ట్రానికి నిధుల విడుదల లేఖ కూడా వచ్చింది. అయితే అప్పటి నుంచి ఈ నిధులు గ్రీన్‌ఛానల్‌లోని ఎపిఎంఐపి ఖాతాకు బదలాయింపు జరగలేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. అయితే ఈ నిధులను రాష్ట్ర ఆర్ధికశాఖ తన ఇతర అవసరాలకు మళ్లించినట్లుగా కనిపిస్తోందని ఉద్యానవనశాఖ అధికారులు అంటున్నారు.
ఇప్పటికే పలు శాఖల నిధులను సంక్షేమం, రుణాలకు అసలు, వడ్డీల చెల్లింపులకు మళ్లించిన ఆర్ధికశాఖ... నబార్డ్ ఇచ్చిన మైక్రో ఇరిగేషన్ నిధులను కూడా మళ్లించినట్టే కనిపిస్తోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర పథకాల అమలుకోసం రాష్ట్రం ఏర్పాటు చేసిన సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలోకి కూడా ఈ నిధులు చేరలేదని తెలిసింది. అసలు ఈ నిధులు ఏమయ్యాయి, ఏ అవసరాలకు వెచ్చించారన్నది ఆర్ధికశాఖ మాత్రమే చెప్పాల్సి ఉంటుందని ఇతర అధికారులు అంటున్నారు. ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేసారన్నదానిపై కేంద్ర ఆర్ధికశాఖ నుంచి కూడా రాష్ట్రానికి లేఖ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులు రూ.613 కోట్లపై దృష్టి సారించారు. ఈ నిధులను ఎస్‌ఎన్‌ఏ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించి, ఆ మేరకు ఆర్ధికశాఖకు కూడా లేఖ రాసినట్లు తెలిసింది.










