అర్థరాత్రి అక్రమ కట్టడాల కూల్చివేత
ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్ : మదనపల్లిలో సుమారు రూ.50 కోట్ల కబ్జా భూమిని కలెక్టర్ గిరీష కాపాడారు. మండలంలోని వలసపల్లి పంచాయతీ జవహర్ నవోదయ స్కూల్‌కు సమీపంలోని బోయకొండ ఆర్చికి ఎదురుగా ఉన్న మదనపల్లి-పుంగనూరు రోడ్డులోని ముంబై టు చెన్నై జాతీయ రహదారి సర్వే నెంబర్ 711/1, 711/2లోని 8.5 ఎకరాలలోని ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన రాజకీయ నాయకుడు ఓ లారీ అసోసియేషన్ పేరుతో మిలిటరీ పట్టా వ్యక్తి వద్ద కొన్నట్లు రికార్డులు సృష్టించి ఆ భూమిని ఏడాదన్నర క్రితం కబ్జా చేశాడు. లారీ అసోసియేషన్ ముసుగులో అధికారం అడ్డు పెట్టుకొని అక్రమ కట్టడాలు నిర్మించాడు. ఈ భూ కబ్జాపై తతంగంపై సిఎం దృష్టికి కొందరి నుంచి ఫిర్యాదు వెళ్ళింది. రెవెన్యూ మంత్రి, కలెక్టర్ దృష్టికి కబ్జా వ్యవహారం వెళ్లడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకునికి భయపడి కిమ్మనకుండా చూసి చూడనట్లు ఇన్నాళ్లు ఉండి పోయారని గ్రహించి వెంటనే కబ్జా స్థలంలో వున్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని మదనపల్లి తహశీల్దార్ సికె.శ్రీనివాసులును కలెక్టర్ గిరీష ఆదేశించారు. మంగళవారం వేకువ జామున రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకొని వెళ్లి తెల్లవారే లోపే భూ కబ్జా స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను జెసిబిల సాయంతో కూల్చి వేయించారు. సాధారణంగా రెవెన్యూ అధికారులు పేదవాడు ఎక్కడైనా చిన్న ఇళ్లు కట్టుకోవాలని సెంటు స్థలాన్ని కబ్జా చేస్తే ఆ స్థలాన్ని నానా హంగామా చేసి కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రెస్‌మీట్‌లు పెట్టి ఊదరగొట్టి గొప్పలు చెప్పుకునే రెవెన్యూ అధికారులు కిమ్మనకుండా ఉన్నారు. రూ.వందల కోట్ల ఆస్తిని కబ్జా నుంచి కాపాడమని బయటకు ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నారు. పట్టణంలో ఈ విషయంపై ఎక్కడ చూసినా చర్చనీయాంగా మారింది. ఇప్పటికైనా అధికారులు కన్ను తెరిచి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.










