Apr 08,2023 21:19

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

రూ.48 కోట్లతో బీచ్‌ రోడ్డు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట  : జిల్లాలోనే పేరుగాంచిన టూరిస్ట్‌ స్పాట్‌ మైపాడు బీచ్‌ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం రూ.48 కోట్లు మంజూరు చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీకి, ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డికి, రక్షణశాఖ సలహాదారులు గుండాలు సతీష్‌రెడ్డికి ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం మండలంలోని కొత్తూరు గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రజలతో మమేకమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.48 కోట్లతో మూడో మైలు నుండి మైపాడుకు రోడ్డు విస్తరణ పనులతో ఇందుకూరుపేట మండలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. ఈ రోడ్డు మూడో నెల నుండి మైపాడు వరకు 9 గ్రామాల మీదుగా 33 అడుగులు వెడల్పుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామన్నారు. పట్టు విడవని విక్రమార్కుడిలా నిధులు మంజూరు కావడానికి ముఖ్యపాత్ర పోషించిన మైపాడు యువనేత దువ్వూరు కళ్యాణ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసల వర్షం గుప్పించారు.
ఇందుకూరుపేట మండలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చడానికి ప్రతిపాదనను ఆమోదించిన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే రవాణా రంగం, ఆక్వా రంగం, రియల్‌ ఎస్టేట్‌, పర్యాటక రంగాలలో ఇందుకూరుపేట ఎలనేని ఖ్యాతిని గడిస్తుందన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి విజరుకుమార్‌ యాదవ్‌, సీనియర్‌ నాయకులు గూడూరు ప్రభాకర్‌ రెడ్డి, బట్టేపాటి నరేందర్‌ రెడ్డి, కైలాసం శ్రీనివాసులు రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.