Jan 12,2023 20:59

కొప్పర్తి పారిశ్రామికవాడక.


బ్రహ్మసాగర్‌ నుంచి సరఫరాకు యత్నం
 కడప ప్రతినిధి
కొప్పర్తి పారిశ్రామికవాడకు నీటి సరఫరా పైప్‌లైన్‌ పనులకు గ్రీన్‌సిగల్‌ లభించింది. ప్రభుత్వం రూ.150 కోట్లతో కూడిన పనులకు ఆమోదం తెలిపింది. తాత్కాలిక పైప్‌లైన్‌ నిర్మాణ పనుల కారణంగా కీ.శే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలోని రూ.450 కోట్లతో అనంతపురం సైన్స్‌సిటీ, బ్రహ్మణీ ఉక్కు పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేసిన సోమశిల బ్యాక్‌వాటర్‌ సరఫరా పైప్‌లైన్‌ మూలన పడింది. ఇటీవలి కాలంలో కొప్పర్తి పారిశ్రామికవాడకు పరిశ్రమల తాకిడి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం నీటి సరఫరా కల్పనపై దృష్టి సారించింది. ప్రస్తుత ప్రతిపాదిత 33 కిలోమీటర్ల మేర 800 మిల్లీమీటర్ల డయామీటర్ల వ్యాసార్థం కలగిన పైప్‌లైన్‌ల ద్వారా 480 మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే (ఎంఎల్‌డి) నీటిని సరఫరా నిమిత్తం రూపకల్పన చేశారు. 1460 ఎంఎల్‌డి సామర్థ్యం కలిగిన సమ్మర్‌ స్టోరేజీ సంప్‌ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఆర్‌టిపిపికి పైప్‌ లైన్‌లతో నీటిని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీపీపీతో అవగాహన కుదుర్చుకుని తాత్కాలిక ప్రాతిపదికన నీటి సరఫరా పైప్‌లైన్‌ ఉపయోగించుకోనున్నారు. రూ.150 కోట్ల డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు పరిశీలన అనంతరం టెండర్‌ పిలిచి శాశ్వత ప్రాతిదిపకన పూర్తిస్థాయి పైప్‌ లైన్‌ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. మైదుకూరు-చాపాడు మధ్య నుంచి వెళ్తున్న ఆర్‌టిపిపి పైప్‌లైన్‌ దగ్గర నుంచి 33 కిలోమీటర్ల మేర తాత్కాలిక పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు రూపకల్పన చేశారు. తాత్కాలిక పైప్‌లైన్‌ కడప-మైదుకూరు జాతీయ రహదారి వెంబడి కొప్పర్తి పారిశ్రామికవాడకు నీటిని సరఫరా చేయనున్నారు. ఆర్నెళ్ల కింద నుంచి కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటైన పరిశ్రమల నీటి అవసరాలకు సబ్‌ మెర్సిబుల్‌ బోర్లపై ఆధారపడిన సంగతి తెలిసిందే. కొప్పర్తి పారిశ్రామికవాడకు పెరుగుతున్న పరిశ్రమల నేపథ్యంలో పారిశ్రామిక అవసరాలకు తగిన మేర నీటి సమస్యను పరిష్కారానికి కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కొప్పర్తి పైప్‌లైన్‌ పనులకు సంబంధించి ఆమోదం తెలిపింది. మార్చి నుంచి కొప్పర్తి పైప్‌లైన్‌ పనులు చేపట్టడానికి ఆనుమతి లభించింది. పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయిలో నీటి సదుపాయం అందుబాటులోకి వస్తే పారిశ్రామికీకరణ మరింత ఊపందుకునే అవకాశాలు పుష్కలముగా ఉన్నాయనడంలో సందేహం లేదు.
పైప్‌లైన్‌ పనులకు శ్రీకారం
కొప్పర్తి పారిశ్రామికవాడకు నీటి సరఫరా పైప్‌లైన్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది. మార్చి నాటికి పనుల్ని గ్రౌండింగ్‌ చేస్తాం. ఆర్నెళ్ల నుంచి రెండేళ్లలోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
- శ్రీనివాసమూర్తి, ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌, కడప