మాట్లాడుతున్న డిఎస్‌పి
ముగ్గురు పాత నేరస్థులు అరెస్టు
రూ.13.80 లక్షల సొత్తు స్వాధీనం
ప్రజాశక్తి-నెల్లూరు :జల్సాలకు, వ్యసనాలకు బానిసలైన ,పగలు సమాజంలో సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి సమయాల్లో ఆతాళలను పగలగొట్టి ఇంటిలోని ఆభరణాలను, నగదు, వస్తువులను దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న ముగ్గురు నిందితులను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.13.80 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు గతంలో నేర చరిత్ర కలిగిన వారుగా పోలీసులు గుర్తించారు. శనివారం సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో సిసిఎస్ డిఎస్‌పి శివాజ రాజా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి నిందితులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కాలంలో ఇంటితాళాలు పగలగొట్టి దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదు ఎక్కువగా ఉండటంతో వాటిని నియంత్రించేందుకు ఎస్‌పి తిరుమలేశ్వరెడ్డి ఆదేశాల మేరకు అడిషినల్ ఎస్‌పి హిమదేవి సూచనల మేరకు సిసిఎస్ సిబ్బంది, కావలి రూరల్ పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ముసునూరు ప్రాంతంలో అనుమానాస్పందంగా సంచరిస్తున్న ముత్తుకూరు, బ్రహ్మదేవి ప్రాంతానికి చెందిన షేక్ గౌస్‌బాషా, కొత్త కాలువ ప్రాంతానికి చెందిన లింగిభేరి రాంబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన రేగలగడ్డ తిరుపతయ్య అను ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. పోలీసుల విచారణలో గతంలో వారి చేసిన చోరీలకు సంబంధించి రూ.13.80లక్షల విలువ చేసే సొత్తును స్వాదీనం చేసుకున్నామన్నారు. నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభను కనపరిచిన సిబ్బందకి రివార్డుకోసం ఎస్‌పికి సిఫార్సు చేశామన్నారు.










