ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌జిల్లా) : పట్టణంలో రూ.10 కోట్ల వ్యయంతో డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి చేశామని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని 7 వ వార్డు సిద్ధార్థ నగర్ లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీకి ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ పట్టణంలో పెద్ద ఎత్తున సిసి డ్రైనేజీలు నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. రూ.10 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి మేజర్ డ్రైనేజీల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. రానున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాధాన్యత క్రమంలో మిగిలిన డ్రైనేజీల నిర్మాణాలు కూడా చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఇన్చార్జ్ చైర్మన్ మాడుగుల నాగరత్నం , కమిషనర్ డాక్టర్ జయరామ్, ఏఈ ఫణి శ్రీనివాస్, వైసిపి పట్టణ అధ్యక్షుడు దొంతి రెడ్డి దేవేందర్ రెడ్డి ,కౌన్సిల్ సభ్యులు రాము, వైసిపి నాయకులు మండవ పిచ్చయ్య, మస్తాన్, గుడివాడ సాంబశివరావు పాల్గొన్నారు .










