Jun 21,2022 23:49

మాట్లాడుతున్న ఆశాజ్యోతి
  • శ్రీ భూసార విభాగ శాస్త్రవేత్త ఆశాజ్యోతి

ప్రజాశక్తి-ఘంటసాల: ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సమగ్ర మరియు సమతుల్య ఎరువుల యాజమాన్యంపై అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కషి విజ్ఞాన కేంద్రం భూసార విభాగ శాస్త్రవేత్త డాక్టర్‌ బి.ఆశాజ్యోతి మాట్లాడుతూ నేటి రోజుల్లో పంటలు సాగు చేసే రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడుతున్నారన్నారు. విచక్షణారహితంగా ఎరువులు, పురుగు, కలుపు మందులు వాడటం వల్ల నేల నిస్సారమైపోతుందని, ముందు తరాల వారికి ఆరోగ్యవంతమైన నేలలను అందించాలని పేర్కొన్నారు. సేంద్రీయ ఎరువుల వాడకమే పంటకు శ్రేయస్కరమని, సేంద్రీయ ఎరువుతో మొక్కకు పోషకాలు లభిస్తాయని, రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం వల్ల పంటకు చీడపీడలు వ్యాపిస్తాయన్నారు. నేలలో ఎంత పోషకాలుం టాయో తెలుసుకుని వాటికి పోషకాలు అందేలా చూడాలన్నారు. భాస్వరం, పొటాషియం తప్పనిసరిగా ఆఖరి దుక్కులో వేసుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గాలంటే సేంద్రీయ ఎరువులు వాడాలని, సేంద్రీయం ద్వారానే నేల గుళ్ల బారుతుందన్నారు. సంపద సష్టి కేంద్రాల్లో వానపాముల ద్వారా తయారయ్యే వర్మీకంపోస్టు పంటకు పోషకాలందిస్తుందన్నారు. పంట వేసే 45 రోజుల ముందు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, పిల్లిపెరస, జీలుగ నేలలో వేసుకోవాలన్నారు. జీవన ఎరువులు ద్రవ రూపంలో లభ్యమవుతున్నాయని, వాటిని స్ప్రే చేయకూడదన్నారు. మట్టిలో కలిసే జీవన ఎరువులు వాడాలన్నారు. పంటల వ్యర్థాలను చాలా మంది రైతులు కాల్చివేస్తున్నారని, ఆ అవశేషాల్లో పోషకాలు ఉంటాయని, వాటిని కలియ దున్నుకోవటం ద్వారా నేలకు బలం చేకూరుతుందన్నారు. ఇఫ్కో కృష్ణాజిల్లా ఫీల్డ్‌ ఆఫీసర్‌ నందకిషోర్‌ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్కో సంస్థ నానో యూరియాను ప్రవేశపెట్టిందని, భూ, వాయు, నీటి కాలుష్యాలు లేకుండా ఉపయోగపడుతుందన్నారు. నానో యూరియాను కేవలం రూ.240లకు సంస్థ అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు డాక్టర్‌ వి.ప్రసూన, డాక్టర్‌ జె.యశ్వంత్‌ కుమార్‌, ఏవో కె.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.