ప్రజాశక్తి - పిఠాపురం
నియోజకవర్గ టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా ముగిసింది. ప్రారంభంలో సజావుగా సాగిన ఆత్మీయ సమావేశం నాయకుల సమన్వయ లోపంతో చివరి అంకానికి చేరుకునే సరికి ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టిడిపి జనసేన సమన్వయ సమావేశాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థల ఆవరణలో పిఠాపురం టిడిపి జనసేన సమన్వయ సమావేశం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం మొదలు అయినప్పటినుండి అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ ఆత్మీయ సమావేశం సాగిస్తున్నామని ఇరువురు నాయకులు తెలిపారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు వారి పాలసీలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి నాయకుల మధ్య మాటమాట పెరిగింది.దాంతో జనసేన ఉదయ శ్రీనివాస్ వర్గం కుర్చీలు విసిరి ఆత్మీయ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.ఏది ఏమైనా మొదటి ఆత్మీయ సమావేశం మీకు మీరే మాకు మేము అన్నట్టుగా ముగిసింది.