Jun 20,2022 23:22

మొవ్వలో కౌలు రైతులతో మాట్లాడుతున్న హరిబాబు

ప్రజాశక్తి-చల్లపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యాయని ప్రజలు వాపోయారు. సోమవారం మండల పరిధిలోని లక్ష్మీపురం చింతలమడ నెహ్రూనగర్‌, రామ్‌నగర్‌ ప్రాంతాలలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీపురం శివారు నెహ్రూ నగర్‌లో రోజు విడిచి రోజు కుళాయిల ద్వారా నీరు విడుదల చేయడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారై బురదమయంగా మారుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని వాపోయారు. లక్ష్మీపురం నుండి చింతలమడ ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు శిథిలావస్థకు చేరిందని తెలిపారు. ఉపాధి కూలీల వేతనాలు సమయానికి ఇవ్వడంలేదని వాపోయారు. ఈ కారక్రమంలో సిపిఎం నాయకులు చౌటపల్లి రవి, మహమ్మద్‌ కరీముల్లా, బండారు కోటేశ్వరరావు, గోళ్ల సాంబశివరావు, పాముల నాంచారయ్య, గోళ్ల సాంబశివరావు, లంకపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి - మొవ్వ: మండల పరిధిలోని వేములమడలో జనం కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులతో రాష్ట్ర కౌలు రైతు సంఘం నాయకులు మాగంటి హరిబాబు మాట్లాడారు. వేములవాడ గ్రామంలో విజేత సీడ్స్‌ విక్రయించిన వంగ విత్తనాలను కొనుగోలు చేయగా సరైన దిగుబడి రాక నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. విజేత సీడ్స్‌ యాజమాన్యంగానీ, ప్రభుత్వంగానీ తగిన నష్టపరిహారం చెల్లించలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలకు తరలించిన ధాన్యానికి సరైన మద్దతు ధర కౌలు రైతులకు కార్డులు ఇవ్వలేదన్నారు. వేములమడ నుండి మొవ్వ వరకు ప్రధాన రహదారి రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.పోలినాయుడు, కౌలు రైతు సంఘం నాయకులు వడ్డీ వెంకటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి బొర్రా సుబ్రహ్మణ్యం, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి సంసోన్‌, కౌలురైతులు కె.శ్రీనివాసరావు, గాంధీ, మురారి అనిల్‌, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-పామర్రు: ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా పామర్రు ఎన్టీఆర్‌ కాలనీలోని 5, 6 వార్డుల్లో సిపిఎం నాయకులు పర్యటించారు. మంచినీరు సక్రమంగా అందడంలేదని, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షాకాలంలో నీరు ఇళ్ల ముందు నిలబడి అనారోగ్యాల పాలవుతున్నామని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో ఒ.గంగాధరప్రసాద్‌, ముళ్లపూడి విల్సన్‌, ఐ.రాజు పాల్గొన్నారు.