ప్రజాశక్తి-భవానీపురం: నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, దీంతో వాహనదారులు గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడతున్నారని మైనారిటీ నాయకులు, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ (ఐజా) విమర్శించారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా 40వ డివిజన్ భవానీపురంలోని కోళ్లఫారం రోడ్డులోని గుంతల్లో షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటి వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్లు మరమ్మత్తులు చేయాలంటూ ప్లకార్డులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐజా మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయని అన్నారు. విజయవాడ నగరంలో, మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు గతుకులమయమై వాహనదారులు ప్రమాదాల పాలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు రోడ్లు బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో 40 డివిజన్ జనసేన మైనార్టీ నాయకులు అబ్దుల్ మున్నా, షేక్ ఇస్మాయిల్, ఎం.డి.ఫిరోజ్, షేక్ బాజీ, షేక్ బాషా, మహిళా నాయకురాల్లు బాణావతి అనిత నాయుడు, చెల్లూరి సంధ్య, లింగంపల్లి అమూల్ తదితరులు పాల్గొన్నారు.










