Jun 24,2022 23:29

  • 34 పనుల్లో పూర్తయినవి 14 మాత్రమే
  • 172 కిలో మీటర్ల నిర్మాణానికి ప్రణాళిక
  • రెండు రోడ్ల మరమ్మతుల్లో తీవ్ర జాప్యం
  • గుడివాడ - కంకిపాడు రోడ్డుకు అరకొరగానే నిధులు

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
రహదారుల, భవనాలు శాఖ (ఆర్‌అండ్‌బి) రహదారులు మూడేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోలేదు. అడుగుకో గొయ్యి పడిన కొన్ని రోడ్లపై ప్రమాదాలు జరిగి జిల్లాలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజాప్రతినిధులపై ప్రజల ఒత్తిడి పెరగడం, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో వీటి మరమ్మతులకు ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. కృష్ణాజిల్లావ్యాప్తంగా 1507 కిలో మీటర్ల రహదారులకుగాను 172 కిలోమీటర్ల నిడివిలో 34 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.79 కోట్లు విడుదల చేసింది. వీటిలో ఇప్పటికి 14 పనులు పూర్తయ్యాయి. మరో 20 పనులు జరుగుతున్నాయి. రెండు కీలక రోడ్ల నిర్మాణానికి టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాటి నిర్మాణానికి ముందుకు రాలేదు. దీంతో మళ్లీ టెండర్లు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోడ్లకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
చల్లపల్లి - నడకుదురు, గుడివాడ నాగవరప్పాడు - నందివాడ మండలం పోలుకొండ, గుడివాడ- కంకిపాడు ఆర్‌అండ్‌బి రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిపై ప్రయాణం ప్రమాదకరంగా ఉంది. చల్లపల్లి నడకుదురు రహదారి నిర్మాణానికి అధికారులు రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. రూ. 50 లక్షలతో 0 కిలో మీటరు నుంచి 900 మీటర్లు చల్లపల్లి నడకుదురు రోడ్డు నిర్మించాల్సి ఉంది. అలాగే రూ.2.96 కోట్లతో అభివృద్ది చేయాల్సి 2.50 కిలో మీటర్ల గుడివాడ - పోలుకొండ రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ పనులకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణానికి ముందుకు రాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంట్రాక్టు సంస్ధలను టెర్నినేట్‌ చేసి తిరిగి టెండర్లు ఆహ్వానించేందుకు ఆర్‌అండ్‌బి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అప్పు రావాలి...నిర్మాణం పూర్తవ్వాలి.
గుడివాడ-కంకిపాడు రహదారి ప్రమాదకరంగా మారింది. పలు ప్రమాదాలకు కారణంగా కేంద్రంగా ఉంది. ఈనేపధ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో డబుల్‌ లైన్‌గా అభివృద్ధి చేసేందుకు రూ. 116 కోట్లు ఖర్చవుతుందని ప్రాధమికంగా అంచనా వేశారు. దీనిలో 4.8 కిలోమీటర్లు మేర డబుల్‌ లైన్‌ రోడ్డు నిర్మాణానికి కేవలం రూ.16 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఈ రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించేందుకు ఫేజ్‌ 3లో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బ్యాంకు అప్పు మంజూరైతేనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి నెలకొంది.
జూలై 15నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి
ఎం. శ్రీనివాసరావు, ఆర్‌ అండ్‌ బి జిల్లా ఇంజినీరింగ్‌ ఆఫీసర్‌
స్పెషల్‌ రిపేర్‌ గ్రాంట్‌, పిరియాడికల్‌ మెయింటినెన్స్‌ కింద జిల్లాలోని రహదారులకు మరమ్మతులు జరుగుతున్నాయి. 172 కిలో మీటర్ల నిడివిలో 34 పనులకు రూ.79 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 14 పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20 పనులను జూలై 15 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నాం.