- కేంద్ర ఐఆర్‌ఎడి నిధుల వినియోగం
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- కొత్త జిల్లాల్లోనూ డ్రైవింగ్ ట్రాక్స్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ఐఆర్‌ఎడి (ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా) నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా వచ్చే ఆరేళ్లలో రూ.381 కోట్లు చేతికి అందుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కార్యాచరణలో పోలీస్, వైద్యశాఖలు కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల వల్ల కనీసం 30 శాతం ప్రమాదాలు తగ్గుతాయని అంటున్నారు. దీనిపై ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు. తక్షణమే ఈ పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల డేటాను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన యాప్‌లో డేటాను నమోదు చేసేందుకు పోలీస్ శాఖకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
వాహనదారులకు అవసరమైన శిక్షణ, లైసెన్సుల మంజూరు విధానం వంటి అంశాలపై కూడా కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉన్న డ్రైవింగ్ పరీక్ష, శిక్షణ కేంద్రాలను మరింత మెరుగుపరచడంతోపాటు కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. లైసెన్సుల జారీ సమయంలో కూడా పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికీ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కూడా నిర్ణయించారు. కొన్నిచోట్ల డ్రైవింగ్ కేంద్రాలనే నైపుణ్య కేంద్రాలుగా మార్చాలని యోచిస్తున్నారు.
రోడ్లపై ఇష్టానుసారంగా, ఇతర ప్రయాణికులను భయకంపితులను చేసేలా డ్రైవింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంటు టీమ్‌ను కూడా ఉపయోగించనున్నారు. రహదారులపై స్పీడ్ లిమిట్‌ను నియంత్రించడంతోపాటు లేన్ మార్కింగ్‌పైనా దృష్టి సారించాలని నిర్ణయించారు. రహదారుల ప్రమాదాలు, ఇతర అంశాలపై కోర్టు కేసులు కూడా తగ్గించాలని నిర్ణయించారు. ప్రజల నుంచి ఇటువంటి కేసులు పెరగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖకు ప్రభుత్వం సూచనలు చేసింది. ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా ఒక లేన్‌ను సిద్ధం చేయాలని, దీనివల్ల ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అధికారులకు సూచనలు వెళ్లాయి.










