ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ ి పని చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పోలీస్, రవాణా, మెడికల్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ తదితరుల అధికారులతో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు అధికారులకు దిశా దశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 24 వరకు వారం రోజులపాటు రవాణా శాఖ ఆధ్వర్యంలో భద్రత వారోత్సవాలు జరుగుతాయని వాటిని విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, కళాశాల యజమాన్యం ప్రమాదాల నివారణకు పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. భద్రత లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బి ఇంజనీరింగ్ తదితర అధికారులతో ఒక కమిటీని వేయాలన్నారు. ప్రమాద స్థలాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల్లో ఇరుక్కున్న క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించే వారికి 5 వేల ప్రోత్సాహక బహుమతులు అందజేయాలన్నారు. గత డిసెంబర్ నెలలో మొత్తం 44 ప్రమాదాలు జరగగా అందులో 30 మంది మృతి చెందారని, 71 మంది గాయపడ్డారని రవాణా శాఖ నివేదిక వల్ల తెలిసిందన్నారు. రోడ్డు భద్రతపై, ప్రమాదాల నివారణపై నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి రామకృష్ణ ప్రసాద్, డిటిసి కరుణ సాగర్ రెడ్డి, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సంజీవయ్య, ఆర్‌టిసి డిఎం వినయతుల్లా, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.










