మాట్లాడుతున్న కలెక్టర్
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం
ప్రజాశక్తి-నెల్లూరు:సెల్ ఫోన్లు మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవసరమైన సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను డిటిసి చందర్ వివరించారు. జిల్లాలో 2023 జనవరి నుంచి మే వరకు 2286 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 105 ప్రదేశాలను గుర్తించామని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డ్ అవర్ లో బాధితుడికి సహాయ సహకారాలు అందించి కాపాడిన వారికి ప్రోత్సాహకంగా గుడ్ సమారిటరన్ అవార్డు కింద రూ 5000 నగదు బహుమతి, సర్టిఫికెట్ను అందజేయనున్నట్లు డిటిసి చందర్ చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లను క్షుణ్ణంగా పరిశీలించి సిగల్స్ ఏర్పాటు, హైమాస్ట్ లైట్లను అమర్చలే చర్యలు చేపట్టాలన్నారు. వి ఆర్ సి కూడలిలో లైటింగ్ ను మెరుగుపరచాలన్నారు. ఎస్పీ ఆఫీసు నుంచి డైకస్ రోడ్డు వరకు తాత్కాలికంగా డివైడర్లు ఏర్పాటు చేయాలని, ఒకవైపు అద్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మత్తులు చేయాలన్నారు. నగరంలో ప్రైవేటు బస్సులు ఇష్టానుసారంగా ఆపుతున్నారని, స్టాపింగ్ పాయింట్లను గుర్తించి, అక్కడే నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సంగం నుంచి ఆత్మకూరు వెళ్లే మార్గంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులకు రేడియం జాకెట్లు, లైట్లు తప్పనిసరిగా అందించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు శాశ్వతంగా హౌర్డింగులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. యువత వేగంగా వాహనాలు నడపకుండా ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై కూడళ్లను పరిశీలించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌పి తిరుమలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మనుబోలులోని జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద లైటింగ్ ను మెరుగుపరచాలని ఎన్ హెచ్ అధికారులకు సూచించారు. సుమారు పది నుంచి 20 మంది ప్రయాణికులను ఆటోల్లో తీసుకెళ్తున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించి, అధికలోడ్ తో ప్రయాణించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిటిసి చందర్, డి ఎం హెచ్ ఓ పెంచలయ్య, డీఈవో గంగా భవాని, డిప్యూటీ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ దేవి కుమారి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ గంగాధర్, ప్రజా రవాణా అధికారి శేషయ్య, డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.










