గుర్రంకొండ : గిట్టుబాటు ధర కల్పించాలని, జాక్‌పాట్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టమోటా రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సాయంత్రం మార్కెట్ యార్డ్ వద్ద కడప-బెంగళూరు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వందలాది వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులో నిరసన విరమించే ప్రయత్నం చేశారు. పోలీసులకు, రైతులకు వాగ్వివాదం జరిగింది. మార్కెట్ యార్డ్‌కు రైతులు తాళాలు వేశారు. కలెక్టర్ వచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని రైతులు రోడ్డుపైనే బైటాయించారు. మండీ యజమానులు, వ్యాపారుల దోపిడీ నుంచి టమోటా రైతులను రక్షించాలని నినాదాలు చేశారు. మదనపల్లె మార్కెట్ కంటే గుర్రంకొండ మార్కెట్‌లో 60 శాతం తక్కువ రేటుకు టమోటాలు కొను గోలు చేస్తున్న విధానంతో రైతులు నష్టపోతున్నారని నినదించారు. మార్కెట్ యార్డ్‌ను తక్షణం మూసివేయాలని, ఎంపీ మిథున్‌రెడ్డికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటి పలు మార్లు ఆందోళనలు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాక్‌పాట్ పేరుతో 100 కిరిట్ల టమోటాకు 20 కిరిట్లు ఉచితంగా మండి యజమానులు తీసుకుంటున్నారని రైతులు వాపోయారు. మండి యజమానులు నాలుగు శాతం కమిషన్ తీసుకోవాలని, పది శాతం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో మాత్రం బోర్డుపై నాలుగు శాతం అని ఉంద న్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మద నపల్లి మార్కెట్‌లో నిల్వ ఉన్న టమోటాలు రూ.150 పలికితే గుర్రంకొండ మార్కె ట్లో రూ.వంద కంటే తక్కువ రేటును నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం పెట్టుబడి కూడా రాకపోగా కూలీలు పడుతున్నాయని రైతులు వాపోతున్నారు ఒకసారి కిలో టమోటా రూ.25 పైసలు కూడా పడటం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రాస్తారోకో చేస్తున్న మార్కెట్ చైర్మన్ రవికుమార్, కార్యదర్శి జగదీష్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. మీ న్యాయమైన కోర్కెలను నెల లోపల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి హామీతో రైతులు రాస్తారోకోను విరమించారు.










