Feb 23,2023 20:04

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జెసి, అధికారులు

ప్రజాశక్తి-రాయచోటి: రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి అనీమియా, గడపగడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతోరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌ గిరీష పిఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డిఎంహెచ్‌ఒ కొండయ్య, డిపిఒ ధనలక్ష్మి, సిపిఒ కష్ణనాయక్‌ హాజరయ్యారు. ఈ సదర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి సచివాలయం పరిధిలో ఎంత మంది గర్భిణులున్నారు, ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారు, వారికి ఐరన్‌ టాబ్లెట్లు, పౌష్టికాహారం అందేటట్లు చూడాలన్నారు. పాఠశాలల వారీగా అనీమియా విద్యార్థులను గుర్తించి రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ పాఠశాలలో చదివే చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందజేస్తూ వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాలింతలు, గర్భిణులలలో రక్తహీనతను దూరం చేయడానికి పోషకాహారమైన భోజనం తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డాక్టర్లు గ్రామంలో ఇంటింటికి వెళ్లి సాధారణ ఆరోగ్య సమస్యలు, గర్భిణులకు, బాలింతలకు, రక్త హీనత ఉన్న వారికి, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు, కిడ్నీ సమస్య ఉన్న వారికి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, కార్యక్రమంలో గుర్తించిన ప్రాధాన్యతా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కషి చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ గిరీష పిఎస్‌ మాట్లాడుతూ జిల్లాలోని సచివాలయాల వారీగా గర్భిణులకు, బాలింతలకు ఐరన్‌ టాబ్లెట్లు, పౌష్టికాహారం సక్రమంగా అందేటట్లు చూడాలని ఐసిడిఎస్‌ పీడీకి సూచించారు. అంగన్వాడీ పాఠశాలల్లో చదివే చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందజేస్తూ వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రక్తహీనతను పూర్తిగా నివారించి ప్రతి సచివాలయం పరిధిలో ఒక్కరూ అనీమియా బాధితులు లేకుండా ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.