Jun 14,2023 22:57

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌

ప్రజాశక్తి-హిందూపురం : ఆపద సమయంలో రక్తదానం చేయడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రభుత్వ అసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రెడ్‌ క్రాస్‌ అధికారి జీబీ విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ పాల్గొన్నారు. దాదాపు 55 సార్లు రక్తదానం చేసిన, 12000 మందికి రక్త దాతల ద్వారా రక్తదానం చేయించిన ఫ్రీడమ్‌ ఫైటర్‌ టిప్పు సుల్తాన్‌ మానవతా రక్త దాన సంఘం వ్యవస్థాపకులు ఉమర్‌ ఫారూక్‌ ఖాన్‌కుఉత్తమ రక్త దాతల పురస్కారాన్ని సబ్‌కలెక్టర్‌ చేతుల మీదుగా అందించి సన్మానించారు. అదే విధంగా ఎక్కువ సార్లు సార్లు రక్తదానం చేసిన వారిని ఈ సందర్బంగా సన్మానించారు. ఈ సందర్బంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతు ప్రమాదాల్లో గాయపడిన వారికి, గర్భిణులకు, అనీమియాతో బాధపడుతున్న వారితో పాటు ఇతర అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడి ప్రాణాదాతలుగా నిలచిన దాతల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ సుపరింటెండెంట్‌ డాక్టర్‌ రోహిల్‌, వైద్యులు ప్రశాంత్‌, సురేష్‌, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు హనుమంతు, టిప్పు సుల్తాన్‌ రక్తదాన సంఘం షేక్‌ షబ్బీర్‌, నాజిమ్‌ తదితరులు పాల్గొన్నారు.