ఒకరి పరిస్థితి విషమం, 8 మందికి గాయాలు
భీతావహంగా మారిన ఏరియా ఆస్పత్రి ప్రాంగణం
పీలేరు: అన్నమయ్య జిల్లా పీలేరు చుట్టూ ఉన్న జాతీయ రహదారులు రక్త మోడాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రహదారులపై మూడు చోట్ల వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరో ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే...నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 12 మంది భక్తులు, తిరువన్నామలైలో పౌర్ణమి సందర్భంగా జరిగే గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తుఫాన్ వాహనంలో శుక్రవారం రాత్రి 10.30 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరారు. వారి వాహనం శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో పీలేరు-చిత్తూరు జాతీయ రహదారిపై పీలేరు పట్టణ శివారులోని ఎంజెఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సమీపంలో బ్రేక్ ఫెయిలై రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢకొీంది. ఈ ప్రమాదంలో నంద్యాల పట్టణంలోని సాయిరాం నగర్‌కు చెందిన చింతల ప్రతాప్‌రెడ్డి(43), ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న ట్రాన్స్కో ఉద్యోగి వందల నాగన్న యాదవ్ సతీమణి వందల విమల (52), అదే కాలనీకే చెందిన రామ్మోహన్ భార్య నేతి లక్ష్మీదేవి (58), నంద్యాల గాండ్ల కొత్తూరుకు చెందిన శివ స్వామి జీవిత భాగస్వామి గాండ్ల శివమ్మ (44) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో 8 మంది గాయపడగా వారిని పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
పీలేరు -మదనపల్లి మార్గంలోని కొండారెడ్డి మిషన్ మలుపులో శనివారం ఉదయం మదనపల్లి వైపు నుంచి వస్తున్న లగేజ్ వాహనాన్ని తిరుపతి నుంచి బాగేపల్లికి వెళుతున్న కర్నాటక ఆర్టీసీ బస్సు ఢకొీంది. ఈ ఘటనలో పీలేరు, సరోజినీదేవి వీధికి చెందిన ముబారక్
కుమారుడు ఇర్షాద్ (29) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు, స్థానిక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీకి చెందిన కె.విజరు కుమార్ (52) తీవ్రంగా గాయపడడంతో అతన్ని పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని తెలిసింది. పీలేరు సిఐ మోహన్ రెడ్డి, ఎస్‌ఐ నరసింహుడు, కల్లూరు సిఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనా స్థలాలకు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం, వెలిగల్లు పంచాయతీ, ఇందుకూరు వాండ్లపల్లికి చెందిన కృష్ణయ్య (50) అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో వైద్యం చేయించుకుని, తిరిగి వస్తూ పీలేరులో తన సన్నిహితుడైన కె.వి.పల్లి మండలంలోని బొప్పసముద్రంకు చెందిన శేషాద్రి నాయుడును కలిశాడు. ఇరువురూ వాహనంలో గాలివారిపల్లికి బయలుదేరారు. పీలేరు మండలం, పొంతలచెరువు క్రాస్ సమీపంలో పీలేరు- కడప జాతీయ రహదారిపై ఆ వాహనాన్ని లారీ ఢకొీనడంతో గాయపడిన కృష్ణయ్యను శేషాద్రి నాయుడు పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు.
పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణం భీతావహంగా మారింది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రి మార్మోగింది. మూడు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెంద డంతో స్థానికులకు కూడా ఆసుపత్రికి చేరుకుని గుమిగూడారు. మృ తుల కుటుంబాలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించి తమ సానుభూతిని ప్రకటించారు. అనంతరం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పలువురు నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకుని మృ తుల బంధువులను కలిసి ధైర్యం చెప్పారు. చిత్తూరు రోడ్డులో జరిగిన ప్రమాద స్థలాన్ని చిత్తూరు డిఎస్‌పి శ్రీనివాసమూర్తి సందర్శించి వెళ్లారు.










