Jun 14,2023 20:57

సిబ్బంది ద్వారా వివరాలు సేకరిస్తున్న డ్వామా ఎపిడి రవికుమార్‌

నిమ్మనపల్లి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని డ్వామా ఎపిడి రవికుమార్‌ తెలిపారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ భవనం ఆవరణంలో 2022-23 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండల వ్యాప్తంగా వివిధ శాఖలలో 1836 పనులకు రూ.4.22 కోట్లను ఖర్చు చేసిన దానిపై 17వ సామాజిక తనిఖీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 లో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా చేసిన ఉపాధి హామీ పనులను, ఇతర శాఖలో చేసిన పనులను సామాజిక తనిఖీ బందం ప్రతి పంచా యతీలోనూ ప్రతి పనిని పది రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన పనులను పరిశీలించి వాటిలోని లోపాలను గుర్తించడం జరిగిందన్నారు. వెంగంవారిపల్లి పంచాయతీలో మామిడి మొక్కలు నాటుకున్న రైతుకు చెల్లిం చాల్సిన బిల్లును వేరొకరికి చెల్లించినట్లు సామాజిక తనిఖీ బందం గుర్తించి, తెలపడంతో ఎపిడి ఉపాధి హామీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్‌ లైబ్రరీకి సంబంధించిన సిమెంట్‌ బస్తాలను కాంట్రాక్టర్‌ ఇతర భవన నిర్మాణాలకు ఉపయోగించడంపై సరైన రికార్డులను సిబ్బంది అందించ కపోవడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారి పనితీరు మెరుగు పరుచుకునేలా చర్యలు తీసుకోవాలని ఎపిఒ రమేష్‌ కు సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని, పొరపాట్లు పునరావతం కాకుండా సరిదిద్దుకోవాలని సిబ్బందికి సూచించారు. సామాజిక తనిఖీ బహిరంగ సభలో ఉపాధి హామీ సిబ్బంది చేత రూ.7,514 లను రికవరీ చేయించి, రూ.22,000 లను అపరాధ రుసుముగా కట్టించారు. కార్యక్రమంలో ఎపిడి మధుబాబు, ఎంపిపి నరసింహులు, ఎంపిడిఒ శేషగిరిరావు, వైసిపి మండల ఇన్‌ఛార్జి ఆర్‌.ఐ.రమణారెడ్డి, ఎస్‌ఆర్‌పికె.భాస్కర్‌, ఎపిఒ రమేష్‌, డిఆర్‌పిలు పవన్‌, శివ కుమార్‌, నూతన్‌ పవన్‌, టిఎలు పద్మావతి, దివ్యభారతి, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.