Apr 15,2022 07:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాస్తవంగా అక్కిరెడ్డిగూడెంలో కంపెనీని పోరస్‌ ల్యాబరేటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, యూనిట్‌-4 పేరుతో పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి నుండి అనుమతి తీసుకున్నారు. కానీ అక్కడ పోరస్‌ మాలిక్యుల్స్‌ అండ్‌ బియాండ్‌ అని పేరుపెట్టి నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధం కానీ పరిశ్రమలశాఖగానీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులుగానీ దానిపై కన్నెత్తి చూడలేదు. ఫ్యాక్టరీ ప్రతిరోజూ 15 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా వినియోగిస్తోందని ప్రాథమికంగా సమాచారం అందింది. ఇంతపెద్దమొత్తంలో కెమికల్స్‌ తయారుచేసిన అనంతం నీటిని తిరిగి భూమిలోకి పంపిస్తున్నారు. దీనికి అనుమతి లేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీ కాలుష్యం వల్ల పంటలు పాడవుతున్నాయని, దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఎప్పటి నుండో ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. హైదరాబాద్‌ కావూరి హిల్స్‌లోని కెకెఆర్‌ స్క్వేర్‌ ప్లాటు నంబరు 402, 403తో రిజిస్టరయిన ఈ కంపెనీలో నామాల అనంతలక్ష్మికుమారి, శ్వేతహాసిని, పురుషోత్తమరావు, శ్రీనివాసన్‌ డైరెక్టర్‌గా యజమానులుగా ఉన్నారు. అనంతలక్ష్మికుమారి కంపెనీలో హోల్‌టైం డైరెక్టర్‌. వీరికి కోదాడ, బీబీనగర్‌, జీడిమెట్ల, అక్కిరెడ్డిగూడెం, పరవాడలోని తానం, అచ్యుతాపురం సెజ్‌లో మొత్తం ఆరుప్లాంట్లు ఉన్నాయి. ప్రమాదం జరిగింది నాలుగో ప్లాంటు.

                                                18 రకాల ఉత్పత్తుల కోసం అనుమతి

ఈ యూనిట్లో 18 రకాల ఉత్పత్తులకు సంబంధించి విజయవాడ పొల్యూషన్‌ కంట్రోలు బోర్డు అధికారుల నుండి అనుమతులు తీసుకున్నారు. వీటిల్లో బిస్పినోల్‌ అసిటోఫినన్‌, ఫినలోఫెతలిన్‌ బిస్పెనోల్‌, ఫినైల్‌, తాలిమైడ్‌, పెంటాపినాలాక్సయిడ్‌, టెట్రామిథయిల్‌ బిస్పనోల్‌ అసిటోన్‌, ఈథేన్‌, హైడ్రాక్సోబెంజోనైట్రైల్‌, నైట్రో ఎన్‌ మిథైల్‌ తాలిమైడ్‌, మీథేన్‌ సల్ఫోనమైడ్‌, సుమట్రిప్తాన్‌ సక్సినేట్‌, సిఫ్రోప్లాక్సిన్‌ హైడ్రోక్లోరైడ్‌, హెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్‌, వెనలాఫిక్సయిన్‌ హైడ్రోక్లోరైడ్‌, సార్టలైన్‌ హైడ్రోక్లోరైడ్‌, సెసికాక్సిబ్‌, క్లోపిడోజెల్‌ హైడ్రోజన్‌ బైసల్ఫేట్‌, ఎన్రోఫ్లాక్సాసిన్‌, పియోగ్లిటజోన్‌ హైడ్రోక్లోరైడ్‌, గాబాపెంటిన్‌ వంటి మందుల తయారీ చేయనున్నట్లు పర్యావరణ అనుమతుల కోసం పెట్టిన లేఖలో పొందుపరిచారు. అలాగే 20 మే 2018లో యూనిట్‌ విస్తరణ కోసం దరఖాస్తు చేసుకోగా 2019 జనవరి రెండోతేదీన కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో తాము ప్రమాదకరమైన నీటిని బయటకు వదలబోమని, మంటలు అంటుకోని విధంగా మొత్తం ప్యాక్టరీలో జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా ఏడేళ్లకు అన్ని అనుమతులూ ఇచ్చేసింది. 1587000 లీటర్ల నీటిని వాడుతోంది. 829000 లీటర్ల నీటిని ప్రతిరోజూ ట్రీట్‌ చేస్తున్నట్లు అనుమతుల పత్రాల్లో రాశారు. తాము పరిశీలించిన సమయంలో అన్నీ సవ్యంగానే ఉన్నాయని, కేంద్రం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు ఆన్‌లైన్లో తనిఖీ చేసేందుకు వీలుగా కెమెరాలూ ఏర్పాటు చేశారని రాశారు. వాస్తవంగా అటువంటి కనీస ప్రమాణాలు ఏవీ తీసుకోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. వీనిపై కాలుష్య నియంత్రణమండలి, పరిశ్రమలశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే ఈ కంపెనీలో మొదటి దశలో 150 మంది రెండోదశలో 150 మంది మూడోదశలో 300 మంది వర్కర్లు పనిచేస్తారని నివేదికలో తెలిపారు. అంతకుమించి రెండింతలు ఇందులో పనిచేస్తున్నట్లు అక్కడ పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. అయితే అక్కడ ప్రమాదకరమైన ఉత్పత్తులు జరుగుతున్నప్పటికీ అక్కడ ఏమి ఉత్పత్తి అవుతుందనేది తెలియదని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పడం విశేషం.
 

                                                              కనీస చర్యలు లేవు

కంపెనీ అనుమతులకు సంబంధించి నామాల పురుషోత్తమరావు దరఖాస్తు చేసుకోగా నామాల శ్రీనివాసన్‌ డైరెక్టర్‌గా అందులో పొందుపరిచారు. ప్రమాదం జరిగిన ఆరుగురు చనిపోయి మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ పోలీసులుగానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. గురువారం సాయంత్రం వరకూ ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. ఆస్పత్రికి యాజమాన్యం తరుపు ప్రతినిధులు వచ్చి వెళ్లినా పోలీసులు వారిని ప్రశ్నించడం వంటి చర్యలేమీ తీసుకోలేదు.