Jun 02,2023 22:11

ఫొటో : నిరసన వ్యక్తంచేస్తున్న నాయకులు

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలపై సిపిఐ తీవ్ర ఆగ్రహం
ప్రజాశక్తి-కావలి : రాష్ట్రంలో భూములు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పెంపును బేషరతుగా ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బలిజేపల్లి వేంకటేశ్వర్లు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎపి సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిత్యావసర వస్తువులు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌ ధరల్లో పక్క రాష్ట్రాలకంటే ఎపిలో లీటరుకు రూ.10 ఎక్కువగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎపిలో వ్యాట్‌ను విపరీతంగా పెంచారని, దీంతో ఆస్తి పన్నులు, ఇంటి ట్యాక్స్‌లు, నీరు, చెత్త పన్నులు, తిండి గింజల ధరలు వూహించని విధంగా పెరిగిపోయాయని విమర్శించారు.
సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో 10 గజాల స్థలం కొనాలంటే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏకరువు పెట్టారు. వైసిపి అధికారంలోకి వచ్చాక విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు కనీసం రెండు పూటలా తిండి తినే పరిస్థితి లేకుండా పోతుందని విరుచుకుపడ్డారు. గ్రామ పంచాయతీలు మొదలుకొని మండలాలు, పట్టణాలు, నగరాల్లో అన్నిరకాల భూములకు ధరలు పెంచి సామాన్యులు కనీసం సెంటు స్థలం కొనే పరిస్థితి లేకుండా చేశారని సిఎం జగన్‌పై మండిపడ్డారు. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలపై పెద్ద ఎత్తున ధరలు పెరగడమే కాకుండా రిజిస్ట్రేషన్‌ చార్జీలకు భయపడి ఆయా భూములు, స్థలాలు సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువులు, సిమెంట్‌, స్టీలు, ఇసుక ధరలు ఊహించని విధంగా పెరిగి పోయాయని దీంతో సామాన్య ప్రజలు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో 5 సార్లు ధరలు పెంచిందని జూన్‌ ఒకటి నుండి మరోసారి భూముల ధరలు పెంచడంతో ప్రజల నెత్తిన గుదిబండ మోపినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్లుగా నాలుగేళ్ల కాలంలో 7సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఎన్నాళ్లు ధరల భారం మోయాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.500 ఉంటే, ఎపిలో రూ.1250 వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని, జగన్‌ ప్రభుత్వం యథేచ్ఛగా ప్రజలను దోచుకుం టోందని దుమ్మెత్తి పోశారు. కర్ణాటక రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఇచ్చి ప్రజలకు కొంతైనా ఊరట కలిగిస్తుంటే ఎపిలో జగన్‌ ప్రభుత్వం రేట్లు పెంచి ప్రజల నడ్డి విరిచేస్తోందని ఘాటుగా విమర్శించారు. సిఎం జగన్‌ ధరలు విపరీతంగా పెంచి ఎపి ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నాడని తూర్పారబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి తక్షణమే పెంచిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.