ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ధర్మవరంలో జరుగుతున్న అక్రమరిజిస్ట్రేషన్లపై టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రిజిస్ట్రార్ కార్యాలయమా, లేక వైసిపి కార్యాలయమా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాలనీలోజరుగుతున్న రిజిస్ట్రేషన్ల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. దశాబ్దాలుగా ఎంతో మంది నివాసముంటున్న స్థలాన్ని కాజేయాలని చూస్తున్న తరుణంలో వివాదం రాజుకుందని, ఇదివరకే అక్కడ రెండు సర్వేనెంబర్లకు సంబంధించి రిజిస్ట్రేషను,్ల ఇతర కార్యకలాపాలు ఆపేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలుసుకున్న పరిటాలశ్రీరామ్ మంగళవారం సబ్ జిస్టర్ కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. అసలు వివాదాల్లో ఉన్న భూములకు, ప్రభుత్వ స్థలాలను ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే తమ వద్ద నిషేదిత జాబితా లేదని రిజిస్ట్రార్ చెప్పడం విడ్డూరంగా ఉందని శ్రీరామ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, మున్సిపాలిటీ ఏర్పడి ఇన్నేళ్లు అయినా కనీసం నిషేదిత జాబితా లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నిషేదిత జాబితాను తామే మున్సిపల్ కార్యాలయం నుండి తీసుకువచ్చి రిజిస్టర్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో అతికిస్తామన్నారు.రిజిస్ట్రేషన్లు కాకుండా యజమానులను ఒత్తిడికి గురిచేసి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.వీటి వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ముందుగా అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతంకాటమయ్య, ఫణికుమార్, చింతలపల్లిమహేశ్ చౌదరి, పోతుకుంట లక్ష్మన్న, పురుషోత్తంగౌడ్, పరిశేసుధాకర్, దేవరకొండరామకృష్ణ రాంపురంశీన, కొత్తపేట ఆది తదితరులు పాల్గొన్నారు.










