ప్రజాశక్తి - రాయచోటిహొ: వైఎస్‌ఆర్ జగన్‌నన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద భూముల రీసర్వేలో విఆర్‌ఒలు, సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ గిరీష పిఎస్ తహశీల్దార్లను, సర్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్, రెవెన్యూ, సర్వే అధికారులకు భూముల రీసర్వే, పిఒఎల్ ఆర్ తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద ఏళ్ల తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డుల రీసర్వేకు పెద్దపీట వేసిందన్నారు. ఈ సమావేశంలో గ్రౌండ్ ట్రూతింగ్, రీసర్వేకి పడుతున్న సమయం మొదలైన అంశాలపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీసర్వే ఆలస్యం కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తహశీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు. భూమి లేని పేదలకు భూ పంపిణీ నిమిత్తం భూమి గుర్తించమని ఆదేశాలు జారీ చేశారు. దళిత, గిరిజనులకు శ్మశాన వాటిక ఏర్పాటు కోసం స్థలం గుర్తించాలని సూచించారు. భూ రికార్డుల శుద్ధీకరణ (పిఓఎల్‌ఆర్)కు సంబంధించి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో కనీసం 50 సర్వేల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. విఆర్‌ఒ, సర్వేయర్ ఒక గ్రామాన్ని మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో ఏవైనా పొరపాట్లు దొర్లినా వాటిని ఆంధ్ర ప్రదేశ్ పట్టాదారు పాసుపుస్తకాలు చట్టం 1971 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 3 ప్రకారం సంవత్సరం లోపల సరిదిద్దుకునే అవకాశం ఉందని తెలియచేశారు. ఈ మేరకు గ్రామాలు , మండలాలలో అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రక్రియలో, లబ్ధిదారుల ఆధార్ కార్డ్, ఫొటోలు మొదలైనవి సరిగ్గా ధవీకరించ బడాలని పేర్కొన్నారు. సమావేశానికి జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాయచోటి, మదనపల్లె, రాజంపేట ఆర్‌డిఒలు, రంగస్వామి, మురళి, కోదండరామిరెడ్డి, తహశీల్దార్లు, సర్వే అధికారులు పాల్గొన్నారు.










