Feb 09,2023 20:39

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జెసి, డిఆర్‌ఒ

సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌
ప్రజాశక్తి - రాయచోటి : రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా పకడ్బందీగా చేపట్టాలని సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలకు సూచించారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా స్థానిక కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌ గిరీష పిఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీ య డిఆర్‌ ఓ సత్యనారాయణ, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఏడి జయరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని చెప్పారు. జిల్లాలో సర్వే టీం గ్రౌండ్‌ ట్రూతింగ్‌, గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, ఆ దిశగా సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి సంబంధిత అధికారులు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన రీసర్వేలో ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులపై దష్టి పెట్టి ఆ అనుభవాలను దష్టిలో ఉంచుకొని మరింత మెరుగ్గా రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రీసర్వే అంశంలో భాగంగా గ్రామాలలో మాడ్యుల్స్‌ అన్ని పక్కాగా పూర్తి చేయాలన్నారు. తహశీల్దార్లు, ఆర్‌డిఒలు సర్వే నిర్వహిస్తున్న గ్రామాన్ని తప్పక సందర్శించాలని చెప్పారు. రీసర్వే పూర్తయిన చోట ఏదేని కారణాలవల్ల ఇంకా భూహక్కు పత్రాలు పంపిణీ చేయని గ్రామాలలో సమస్యలు పరిష్కరించుకొని త్వరితగతిన భూహక్కుపత్రాలు పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే గ్రామాలలో రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే పూర్తయిన తర్వాత తప్పకుండా సంతకాలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని సర్వే సిబ్బంది, తహశీల్దార్లతో ఎప్పటికప్పుడూ సమన్వయం చేసుకొని నిర్దేశించిన కాల పరిమితిలోగా సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ రీ సర్వే కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో సర్వే పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. రీ సర్వే వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు. సర్వే పనులను అధికారులు బాధ్యతగా తీసుకొని నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలన్నారు.