ప్రజాశక్తి రాయచోటి : జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షా, సమగ్ర సర్వే కార్యక్రమాన్ని నిర్దేశించిన గడువు లోపల పూర్తిచేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ రీ-సర్వే, భూ సేకరణ ఎస్సీ ఎస్టీ కాలనీలలో శ్మశాన వాటికలకు స్థలాల గుర్తింపు, తదితర అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే పక్కాగా పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో రీ సర్వేకు సంబంధించి అవసరమైన సర్వేయర్లు, సిబ్బంది ఉన్నారని రీ సర్వేను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆర్డీవోలు తగు చర్యలు చేపట్టాలన్నారు. సర్వే వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని రీసర్వే పనులు పక్కాగా, పగడ్బందీగా చేయకపోతే రెండవ సారి చేయాల్సి వస్తుందన్నారు. రీసర్వేకు సంబంధించిన ప్రతి పని జాగ్రత్తగా పరిశీలించి చేయాలన్నారు. సమగ్ర సర్వేవల్ల అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని రైతులకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వేకు సంబంధించి రైతులందరికీ అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 30 మండలాలలో రీ సర్వేకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. రీ సర్వే పనులను సంబంధిత ఆర్డీవోలు పర్యవేక్షణ చేయాలన్నారు. అసైన్‌మెంట్ కమిటీ ద్వారా పేదలకు భూ పంపిణీ చేసేందుకు ప్రతి మండలంలో తహశీల్దార్‌లు 100 ఎకరాలు ప్రభుత్వ భూమి గుర్తించి తమకు రిపోర్ట్ పంపాలన్నారు. ఈ భూమి ఎస్సీ, ఎస్టీ పేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటివరకు గుర్తించిన ప్రభుత్వ భూమి, ఎస్సీ, ఎస్టీ అర్హుల జాబితా వెంటనే తమకు పంపాలన్నారు. తహశీల్దార్‌లు అందరూ ప్రతి మండలంలో గ్రామాల వారీగా సర్వేనెంబర్ల వారీగా ఎంత భూమి గుర్తించారో నివేదిక తమకు పంపాలన్నారు. ఇది పేదలకోసం చేసే కార్యక్రమం అని ఇప్పటినుంచి తహశీల్దార్లు, సర్వేయర్లు భూ సేకరణ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని ఆర్డీవోలు, తహశీల్దార్లకు సూచించారు. శ్మశానాలు లేని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెంటనే స్థలాన్ని గుర్తించాలన్నారు. శ్మశానవాటిక గ్రామానికి కిలోమీటర్ లోపల మాత్రమే ఉండేటట్లు చూడాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కాలనీవాసులు శ్మశానవాటిక లేదని ఎటువంటి ఫిర్యాదులు తమకు రాకుండా చూడాలని తహశీల్దార్లకు సూచించారు. జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ల నిర్మాణాలకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్‌ను గుర్తించాలన్నారు. కోర్టు కేసులను జాగ్రత్తగా పరిశీలించి బాధితులకు నోటీసులు జారీ చేసి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్డివోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, ల్యాండ్ అండ్ సర్వే ఏడి జయరాజు, తహశీల్దార్‌లు పాల్గొన్నారు.










