ప్రజాశక్తి-రాయచోటి: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి స్పందన, హౌసింగ్, రీ-సర్వే అగ్రికల్చర్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రీ సర్వేకు సంబంధించిన ప్రతి పని జాగ్రత్తగా పరిశీలించి చేయాలన్నారు. రీ సర్వే ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందని, ఈ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆర్‌బికెల ద్వారా రైతులకు కావాల్సిన సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు అందించి వ్యవసాయ అభివక్ష్మిఋద్ధికి కృషి చేయాలన్నారు. పాడి రైతులు జగనన్న పాలవెల్లువ అమూల్ కేంద్రాలకు పాలు పోసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ గిరీష మాట్లాడుతూ జిల్లాలోని భూముల రీ సర్వేకు సంబంధించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి గడువులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. తాహశీల్దార్లు, ఆర్డీవోలు వారానికి ఒకరోజు రీసర్వే జరుగుతున్న గ్రామాలను తప్పకుండా సందర్శించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే గ్రామాలలో రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2022-23 రబీ ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులకు ప్రొక్యూర్మెంట్, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతోందని, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంట సాగు చేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు తదితర అన్ని రకాల వివరాలను పకడ్బందీగా వంద శాతం నమోదు చేయాలన్నారు. జిల్లాలో అమూల్‌కు పాల సేకరణ పక్కాగా జరగాలన్నారు. పాల సేకరణ కొరకు అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జగనన్న పాలవెల్లువ ప్రాముఖ్యతను పాడి రైతులకు తెలియజేసి అమూల్‌కు పాలు పోసే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సంబంధిత హౌసింగ్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ సీరిరుసగా తీసుకుని లేఅవుట్ వారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించాలని అధికారులను ఆదేశించారు. పీఎంఏవై గ్రామీణ్ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలన్నారు. అధికారులు స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. స్పందన ఆర్జీలను నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డిఆర్‌ఒ సత్యనారాయణ, డిపిఒ ధనలక్ష్మి, హౌసింగ్ పీడీ శివయ్య, ల్యాండ్ అండ్ సర్వే ఎడి జయరాజు పాల్గొన్నారు.










